కౌరవ సభ నుంచి గౌరవసభగా ఏపీ అసెంబ్లీ మారిందని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు జరగనిచ్చే ప్రశ్నే లేదని ప్రస్తుత అధికార పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. గతంలో వినిపించిన భాష, ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదన్నారు. దానికి ్ందరూ అంగీకరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా గౌరవసభ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
అంటే వైసీపీకి చెందిన పదకొండుమంది ఎమ్మెల్యేలు.. జగన్ తో సహా అందరూ సభకు వస్తే.. వారెవరికీ గతంలో వారు చేసిన వ్యవహారాలకు ప్రతీకారంగా అవమానాలు సమర్పించే కార్యక్రమం ఉండదని ప్రజా సమస్యలపైనే చర్చిస్తామన్న సంకేతాలు పంపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై చర్చ జరుగుతుంది కాబట్టి.. తమ వాదన వినిపించుకునేందుకు వైసీపీ నేతలు కూడా ధైర్యంగా రావొచ్చని చెబుతున్నారు.
అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై జగన్ స్పష్టత ఇవ్వడం లేదు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క క్షణం కూడా సభలో ఉండకుండా వెళ్లిపోయిన ఆయన తీరు కారణంగా .. ఆయన ఈ ఐదేళ్లు సభకు వస్తారని అనుకోవడం లేదు. కానీ ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నారు. వాళ్లు వ్యవహరించినట్లుగా వ్యవహరించబోమని సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే ఆయన గౌరవానికి లోటు లేకుండా మొదటి రోజే ప్రోటోకాల్ కు మించి గౌరవం ఇచ్చారు. మరి వస్తారా ?