పార్టీలో గౌరవం దక్కడం లేదని రాజీనామా చేయడానికి సిద్ధపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. పార్టీ ముఖ్యనేతలందరూ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. బుచ్చయ్య సమస్యలను తక్షణం పరిష్కరించి… రాజమండ్రి తెలుగుదేశంలో ఉన్న వర్గ విబేధాలను ఓ కొలిక్కి తీసుకు రావాలని చంద్రబాబు ఓ బృందాన్ని నియమించారు. వారు హుటాహుటిన రాజమండ్రి చేరుకుని తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. రాజీనామా అంశంపై ఇంత వరకూ ఏ మీడియాతోనూ మాట్లాడని బుచ్చయ్య చౌదరి గురువారం రాత్రి ఏబీఎన్‌తో మాత్రం గంట సేపు మాట్లాడారు.
ఏబీఎన్‌తో గంట సేపు చర్చా కార్యక్రమంలో పాల్గొని.. పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ ఏకరవు పెట్టారు. తన అసంతృప్తిని అంతా వెళ్లగక్కారు. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న వారికి గుర్తింపు లేదని… కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పార్టీ మంచి కోసం తాను ఇచ్చిన సలహాలను పట్టించుకోకపోగా.. తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో అంతర్గత విబేధాల గురించి ఆయన బ యటకు ఏమీ చెప్పలేదు కానీ.. తనను ఎలా అవమానిస్తున్నారో చెప్పుకున్నారు.
ఏబీఎన్‌లో వచ్చిన ఇంటర్యూతో టీడీపీ హైకమాండ్‌కు ఆయన సమస్య ఏమిటో అర్థమైనట్లుగా ఉంది. అందుకే… ఆ ఇటీవల నియమించిన కమిటీల్లో కొన్ని మార్పులు చేసి ఆయన అనుచరులకు అవకాశం కల్పించడం…రాజమండ్రిలో ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెట్టకుండా చూడటం వంటి అంశాలను కవర్ చేయాలని చెప్పి చంద్రబాబు సీనియర్ నేతల బృందాన్ని పంపారు. బుచ్చయ్య చౌదరితో వారు చర్చలు జరుపుతున్నారు. బుచ్చయ్య తన రాజీనామాకు ఇరవై ఐదో తేదీ వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ లోపు ఆయనను కూల్ చేయాలని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు.