ముద్రగడ పద్మనాభంతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తెదేపా ప్రభుత్వం అయోమయంలో ఉన్నందునో లేదా అది తన పథకం ప్రకారమే ఆవిధంగా వ్యవహరిస్తోందో తెలియదు కానీ చాలా గందరగోళం సృష్టిస్తోందనిపిస్తోంది. ముద్రగడ డిమాండ్లకి తలొగ్గి 10 మందిని బెయిల్ పై విడుదల చేసిన ప్రభుత్వం మరో ముగ్గురిని ఇంకా విడుదల చేయవలసి ఉంది. ఒకవేళ మిగిలినవారిని కూడా విడుదల చేసే ఉద్దేశ్యం ఉన్నట్లయితే అదే విషయం మధ్యవర్తుల ద్వారా ముద్రగడకి చెప్పి దీక్ష విరమింపజేయవచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా, వారిలో ఒకరిని 3 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. యధాప్రకారం మళ్ళీ కొందరు మంత్రులు, తెదేపా నేతలు తమ నోటికి పని చెపుతున్నారు. పది రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందేమిటని ఒక మంత్రి ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన ఆవిధంగా మాట్లాడినందుకు దాసరి, చిరంజీవి తదితర కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ముద్రగడని ఎవరూ కలవనీయకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోంది? ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి ప్రభుత్వం అంత గోప్యత పాటించవలసిన అవసరం ఏముందని” బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నలు సహేతుకంగానే ఉన్నాయి. ముద్రగడ కోరినట్లుగా అరెస్టయిన వారిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్దపడగానే ఆయన వైద్య పరీక్షలకి అంగీకరించి సెలైన్ కూడా ఎక్కించుకొంటున్నారు. అంటే దీక్ష విరమణ చేసినట్లే కదా! కానీ ఆయనని ఇంకా ఎవరూ కలవనీయకుండా పోలీసులు అడ్డుపడటం, ఆయన గురించి, ఆయనకి మద్దతు ఇస్తున్న వారి గురించి మంత్రుల చేత రకరకాలుగా మాట్లాడించడం అనవసరమే కదా? ఆయన కూడా తన దీక్షని కొనసాగిస్తూ ఇంకా గందరగోళం సృష్టిస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియకనే ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తోందా లేక ఉద్దేశ్యపూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. ఈ వ్యవహారం ఇంకా ఎక్కువ రోజులు సాగడం ఎవరికీ మంచిది కాదు. కనుక ప్రభుత్వం, ముద్రగడ కూడా విజ్ఞతతో వ్యవహరించి దీనికి తక్షణమే ముగింపు పలకడం మంచిది.