యజ్ఞానికి ఏంటి యత్నమయ్యా అంటే… కట్టెలు తెస్తే సరిపోతుందని వెనకటికి ఎవరో అన్నారట! అసెంబ్లీ సమావేశాల కోసం అధికార తెలుగుదేశం సమాయత్తమౌతున్న తీరు అచ్చంగా ఇలానే ఉంది. సమావేశాలు వస్తున్నాయంటే… ప్రజా సమస్యలపై ఏయే అంశాలను చర్చకు పెట్టాలీ… ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును పారదర్శకంగా ఎలా సమీక్షించాలీ… ఇలాంటి అంశాలపై శాఖలవారీగా కసరత్తు ఉండాలి. కానీ, తెలుగుదేశం ఇప్పుడు చేస్తున్న కసరత్తు ఏంటయ్యా అంటే.. ప్రతిపక్ష పార్టీని ఎలా నిలువరించాలన్నదే వారి ఏకైక లక్ష్యంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సభలో వైకాపా నోరెత్తకుండా చేయడం ఎలా… జగన్‌ను కంట్రోల్ చేయడం ఎలా అనేదానిపై వారి దృష్టి ఉందని చెప్పడానికి.. తాజా పరిణామమే నిదర్శనం.
కృష్ణా జిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంపై అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరి కూడా ఎంతో స్పష్టంగా ప్రజలకు అర్థమౌతోంది. ప్రమాదానికి మూలకారణమైన విషయాలపై నుంచి ప్రజల దృష్టికి ప్రతిపక్ష నేత మీదికి మళ్లించారు! బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌పై కేసు పెట్టారు. ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణకు అడ్డుపడ్డారంటూ ఆయనపై ఆరోపణలు చేశారు. అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఏంటయ్యా అంటే… కలెక్టర్ చేతి నుంచి జగన్ లాక్కున్న కాగితాలేంటో, ఆ పత్రాల్లో ఉన్న వాస్తవాలంటో ఇప్పుడు పోలీసులు బయటపెట్టడం కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది!
దివాకర్ ట్రావెల్ డ్రైవర్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటూ ఆరోజున జగన్ ఆందోళనకు దిగారు కదా! నిజం ఏంటంటే.. వైద్యుల నుంచి జగన్ లాక్కున్నవి పోస్ట్‌మార్టం రిపోర్టు కాదట! డ్రైవర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయండీ అంటూ ఆసుపత్రి వర్గాలకూ, పోలీసులకు రాసుకున్న వినతి పత్రమట! అంటేకాదు, అవి పోస్ట్ మార్టం రిపోర్టులు కావని పోలీసులు ఎంత మొత్తుకున్నా జగన్ వినిపించుకోకుండా అడ్డగోలుగా వాదనకు దిగారన్నది తాజా నివేదిక సారాంశం.
దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రమాదానికి గల కారణాల గురించి ప్రభుత్వం లైట్ తీసుకుంటోందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే, రేప్పొద్దున్న శాసన సభ సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రమాదం విషయంలో పక్షపాత బుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు చాలానే ఉన్నాయి. ఈ అంశం శాసన సభలో చర్చకు వస్తే… ప్రభుత్వం ఇరుకున పడటం ఖాయం, అందుకు ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నదీ వాస్తవం. అయితే, ఈ లోగానే ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేయడం తాజా రిపోర్టు వెనక వ్యూహంగా కనిపిస్తోంది. లేదంటే… ఇన్నాళ్లూ లేని ఈ రిపోర్టు ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది..? జగన్ హడావుడి చేసిన రోజునే కలెక్టర్‌గానీ, ఇతర పోలీసు అధికారులుగానీ ఈ నివేదిక గురించి ఎందుకు మాట్లాడలేదు..? అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే… జగన్ గొడవపై పోలీసు దర్యాప్తు హడావుడిగా ఎప్పుడు జరిగిపోయింది..?