అధికారం నీడ కొరకు అతిగా వెంపర్లాట
అభివృద్ధి కోసమంటు బయటకు చెప్పే మాట!
నేతల అవకాశవాద విశృంఖల పోకడలకు
ప్రగతి పేర భలే దొరికె బుకాయింపు తూటా!
అధికారం గొడుగు కింద లేకుంటే నిధులీరా?
ప్రతిపక్షం ఉన్నచోట ప్రజలను పగబడతారా?
ఇది నవీన రాజనీతిగ దాపురించిన ఖర్మం
విలువలన్ని భ్రష్టమైన ప్రజాస్వామ్య ధర్మం !!
తెలంగాణలో తెలుగుదేశం వారంతా వెళ్లి తెరాసలో చేరినంత కాలమూ వారిని తిట్టిపోశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెదేపాలోకి వలసలు మొదలయ్యాయి. జంపింగ్‌లు చేస్తున్న అందరూ చెబుతున్న మాట మాత్రం ఒక్కటే.
తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే అధికార పార్టీలో చేరుతున్నాం అంటూ ప్రతి ఒక్కరూ ప్రకటిస్తున్నారు. నిజానికి ఇది ప్రభుత్వాలు సిగ్గుపడవలసిన మాట. పై మాటలకు అర్థం ఏమిటి? అధికార పార్టీలో చేరితే తప్ప.. వారి నియోజకవర్గాన్ని ప్రభుత్వం తొక్కేస్తుందన్నమాట. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. అలా చెబుతున్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తాము పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని.. తమ పార్టీ వారికి మాత్రమే నిధులు ఇస్తాం అని అధికార పార్టీ ఒప్పుకుంటున్నట్లే లెక్క. మరి ఇంత దుర్మార్గంగా పార్టీలు ఎందుకు వ్యవహరిస్తున్నాయో.. ప్రజలు ఈ పోకడల్ని ఎలా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాయో తెలియడం లేదు.