ఆయన అంతే… అవసరం తీరిపోగానే ఎంతటివారినైనా ఇట్టే పక్కన పడేస్తారనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎవర్ గ్రీన్ విమర్శల్లో ఇదీ ఒకటి. తాజాగా ఇదే మాట అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల నుంచి ఇప్పుడు మళ్లీ వినిపిస్తూ ఉండటం విశేషం. తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య ఎంతో కీలకంగా ఉంటూ వచ్చిన ఇన్ఛార్జ్లను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు అనే విమర్శ వినిపిస్తోంది. వారి అవసరం తీరిపోయింది కాబట్టి… వారిని పట్టించుకోవడం లేదన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి.
అసలు విషయం ఏంటంటే… గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలో చాలావరకూ ఇన్ఛార్జ్లదే హవా నడిచేది. కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో వారిదే పైచేయిగా ఉండేదని అంటారు! ఫిరాయింపు నేత నియోజక వర్గంలో ఏ పనులు జరగాలన్నా, చివరికి చిన్న చిన్న సమస్యల పరిష్కారం చేయాలన్నా అంతా ఇన్ఛార్జులే చూసుకునేవారని ఆ మధ్య అనుకున్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనులూ, కాంట్రాక్టుల కేటాయింపులూ, ఉద్యోగుల బదిలీలు ఇలా అన్నింటా వారి ఆధిపత్యమే నడిచేది. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే పరిస్థితి నామ్ కే వాస్తే అన్నట్టుగానే ఉండేది! నిజానికి, ఇన్ ఛార్జ్ లు అనేవారు ఎమ్మెల్యేలు కాకపోయినా సరే, ప్రోటోకాల్ ఉండేది. వారి వాహనాల ముందు పోలీసు జీపు, అధికారుల హంగామా షరా మామూలు.
ఇలా ఇన్ఛార్జ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పోతుంటే ఎమ్మెల్యేలకు కడుపు మండదా..? ఎమ్మెల్యేలకూ ఇన్ ఛార్జ్ లకూ మధ్య దూరం పెరగడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఎమ్మెల్యేల వల్ల ఏ పనులూ కావని ప్రజలు అనుకుంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి. ఇదే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు కొంతమంది మొరపెట్టుకున్నారు. ఇన్ఛార్జులకూ ఎమ్మెల్యేలకూ మధ్య ఉన్న విభేదాలు కూడా ఆయన వరకూ చేరిపోయాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేసిందట. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వాలనీ, వారు చెప్పినట్టుగా చేయాలన్నది సదరు ఆదేశాల సారాంశం. ఇన్ఛార్జ్లకు ప్రోటోకాల్ అవసరం లేదని కూడా అభిప్రాయపడటం విశేషం. దీంతో కొంతమంది ఇన్ఛార్జ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అవసరం ఉన్నంత సేపూ వాడుకుని, తరువాత ఠక్కున పక్కన పడేయడం తమ నాయకుడికి అలవాటే అని ఆ పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ విమర్శిస్తున్న పరిస్థితి. చంద్రబాబు నైజం మరోసారి బయట పడిందని వారంటున్నారట!