అమ్మాయిల చదువులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే సందర్భంలో వారికి సాయంగా ఉండటానికి తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం అనే కార్యక్రమం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్స్ లు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు ఇస్తుంది. విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం రూపొందించారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో ఈ కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుందని నారా భువనేశ్వరి ప్రకటించారు. తర్వాత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారాఈ పథకం వివరాలను వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలుచేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణం పై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం https://kalalakurekkalu.com వెబ్ సైట్ కు వెళ్ళాలని సూచించారు.
మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం. మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు… మన ఆడబిడ్డలు బాగుండేలా చూడడం. మీ అందరి మద్దతుతో త్వరలో ఏర్పడే టీడీపీ – జనసేన ప్రభుత్వంలో మీకు అభివృద్ధి, స్వేచ్చ, భద్రత కల్పిస్తాం అని మాట ఇస్తున్నానని చంద్రబాబు తెలిపారు.