వైయస్సార్సీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడం… ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద టాస్క్‌గా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత జగన్ బాగా ప్రిపేర్ అయి వస్తున్నారు. ఏ అంశం తీసుకున్నా పూర్తి లెక్కాపత్రాలతో మాట్లాడుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. ఉదాహరణకు.. తెలుగుదేశం చూపించిన వృద్ధిరేటులోని డొల్లతనాన్ని లెక్కలతో సహా సభలో జగన్ వివరించారు. దీంతో ఈసారి సమావేశాలను పక్కా ప్రణాళికతోనే వైకాపా డీల్ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త చర్చ మొదలైంది. వైకాపా చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టడంలో టీడీపీ మంత్రులు విఫలమౌతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతూండటం విశేషం.
తాజాగా, గుంటూరులో అధికార పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశం జరగడం విశేషం. ఎవరు, ఎప్పుడు, ఎలా, దేని గురించి మాట్లాడాలనేదే ఈ సమావేశంలో హట్ టాపిక్. అయితే, అనూహ్యంగా మంత్రుల తీరుపై టీడీపీ శాసన సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారట! వైకాపా చేస్తున్న విమర్శల్ని మంత్రులు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారని.వారి మాటల్లో పదును సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సభలో సహజంగానే మంత్రులకే ఎక్కువగా మాట్లాడే అవకాశం వస్తుందనీ, అయినాసరే వైకాపా విమర్శల్ని ధీటుగా ఎదుర్కొంటున్నట్టుగా అనిపించడం లేదని అభిప్రాయపడ్డారట.
ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో మంత్రులే ముందుండాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారట. అంతేకాదు, ఆ బాధ్యత తమపై నెట్టేసి… మంత్రులు చేతులు దులుపుకుంటే కుదరదని కూడా కొంతమంది శాసన సభ్యులు స్పష్టం చేశారట! ఒకవేళ ఎమ్మెల్యేలకే ఆ బాధ్యత వదిలేస్తే… ఏయే అంశాలపై ఎవరు విమర్శలు చేయాలో ముందుగా చెప్పాలని పట్టుబట్టినట్టు సమాచారం. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే… సభలో మంత్రులు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటే, మేము వైకాపాకి సమాధానాలు చెప్పుకోవాలా అని..!
మొత్తానికి, సభలో వైకాపాని నిలువరించేందుకు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం కసరత్తు చేస్తోందన్నది అర్థమౌతోంది. మంత్రుల తీరుపై ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయం ఇలా బయటపడిందని చెప్పాలి. మరి, ఈ ఇష్యూని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారూ… విమర్శల బాధ్యతల విభజన ఎలా చేస్తారూ, బాధ్యతల్ని ఎలా పంచుతారో వేచి చూడాలి..!