తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ రాష్ట్రంలో సగటున ప్రతీ రెండు నెలలకి ఓసారి ఏవో ఒక ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో అధికార తెరాస పార్టీ ప్రత్యర్ధ పార్టీలను చిత్తు చేస్తూ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తోంది. అయితే అది ప్రజాస్వామ్య పద్ధతులకు లోబడి సాధించి ఉండి ఉంటే, దానికి చాలా గౌరవంగా ఉండేది. ఆవిధంగా గెలవగలిగితే రాష్ట్ర ప్రజలందరూ తెరాసవైపే ఉన్నారని, తెరాస ప్రభుత్వ పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చేస్తున్న వాదన నమ్మశక్యంగా ఉండేది.
కానీ ప్రజలు తమవైపే ఉన్నారని తెరాస అధిష్టానం అంత బలంగా నమ్ముతున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు పార్టీలో చేర్చుకొన్న కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యే చేత రాజీనామాలు చేయించి, ధైర్యంగా ఉపఎన్నికలను ఎదుర్కొని ఉండి ఉంటే అది నిజమని ప్రజలు కూడా నమ్మేవారు కదా? కానీ అది నేటికీ వారిచేత రాజీనామాలు చేయించకుండా, పార్టీలో సభ్యులుగా, మంత్రులుగా కొనసాగించడం గమనిస్తే దాని వాదనలో డొల్లతనం అర్ధమవుతుంది. ఒకవిధంగా చూస్తే అది దాని అభాద్రతాభావానికి ప్రతీక అని చెప్పవచ్చు.
“రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదు…ఎప్పటికీ తమ పార్టీయే అధికారంలో కొనసాగాలి…ఆ అధికారం వారసత్వంగా కొనసాగాలి” అనుకోవడం రాజరికపోకడలే తప్ప ప్రజాస్వామ్య విధానం కాదు. అయినా దేశంలో ఒక రాష్ట్రంగా కొనసాగుతూ “మాకు ఈ ప్రజాస్వామ్యం, ఎన్నికలు వద్దు” అని చెప్పే అవకాశం లేదు కనుక, ఆ పరిధిలో ఉంటూనే దానికి అన్ని విధాల తూట్లు పొడుస్తూ తమ మాట చెల్లించుకొంటోంది.
తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి గత రెండేళ్లుగా తెరాస మరొక సరికొత్త వ్యూహం కూడా అమలు చేస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గం లేదా ప్రాంతంలో తనకు గట్టి పోటీగా కనబడుతున్న ప్రత్యర్ధి పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలను, ప్రజా ప్రతినిధులను, వీలయితే ప్రత్యర్ధ పార్టీ అభ్యర్ధులను కూడా నయాన్నో, భయాన్నో తెరాసలోకి రప్పించడం. తద్వారా ఎన్నికలకు ముందు ప్రత్యర్ధ పార్టీని మానసికంగా, రాజకీయంగా దెబ్బ తీస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను నిశితంగా గమనించినట్లయితే అది అర్ధమవుతుంది. ప్రస్తుతం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ని తెరాసలోకి రప్పించుకొంతోంది. ఇదే తాజా ఉదాహరణ. ప్రతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా, ప్రతీ ఎన్నికలలో గెలవడం తప్పనిసరి అన్నట్లుగా భావిస్తూ, అందుకోసం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాని అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది. అందుకు కారణాలు పైన చెప్పుకొన్నాము. మంచిని వ్యాపింపజేసి దానిని ఆచరించడం చాలా కష్టం కానీ చెడుకి ఆ పరిమితులు లేవు. అందుకే ఇప్పుడిది ఒక అంటురోగంలాగ ఆంధ్రప్రదేశ్ కి కూడా వ్యాపించింది. ఈ విషయంలో తెరాసనే ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షిస్తోంది. బహుశః మున్ముందు ఈ అంటురోగం దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాపించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో మళ్ళీ రాజ్యాలు, రాజరిక పాలన మొదలవుతుందేమో?