‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అనే నానుడి ఊరికే రాలేదని తెదేపాలో మొదలయిన అంతర్గత పోరు మరోమారు నిరూపిస్తోంది. తెదేపాలో భూమా నాగిరెడ్డి చేరికతో కర్నూలు జిల్లాలో చిచ్చురేగింది. మొదటి నుంచి ఆయన చేరికను శిల్పా మోహన్ రెడ్డికి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరియు కొత్తపల్లి సర్పంచ్ తులసి రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా ప్రయత్నం చేసారు. ఆ దాడిలో ఆయన చాలా తీవ్రంగా గాయపడటంతో తక్షణమే హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇంకా చాలా విషమంగానే ఉంది. తన అనుచరుడిపై భూమా వర్గానికి చెందినవారే దాడి చేసారని శిల్పా మోహన్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. ఇంతవరకు వైకాపాలో ఉన్న ఆయన తెదేపాలో చేరిన తరువాత జిల్లాలో పార్టీలో తన ప్రత్యర్ధ వర్గాన్ని ఈవిధంగా భయబ్రాంతులను చేసి జిల్లాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవలని ప్రయత్నిస్తున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆరోపణలను భూమా నాగిరెడ్డి ఖండించారు. ఆ దాడితో తనకు, తన అనుచరులకు గానీ ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. జిల్లాలో ప్రజలు తన వెంటే ఉన్నారని కనుక ఎవరిపైనో దాడి చేయవలసిన అవసరం తనకు లేదని చెప్పారు. ఈ దాడితో భూమాకి సంబంధం ఉన్నా లేకపోయినా, ఆయనకి, శిల్పాకి మధ్య అప్పుడే విభేదాలు, యుద్ధం మొదలయిందనే సంగతి స్పష్టం అయింది. కడప జిల్లాలో జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరికను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు ఆయనని పార్టీలో చేర్చుకొన్నారు. కనుక బహుశః అక్కడా వారిరువురి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా నెలకొని ఉన్నాయనే భావించవచ్చును. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సుబ్బారావులను కూడా తెదేపాలో చేర్చుకోబోతున్నారు కనుక తూర్పు గోదావరి జిల్లాలో కూడా తెదేపాలో ముసలం పుట్టవచ్చును. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే ఉద్దేశ్యంతో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షిస్తుంటే, దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతున్నట్లు కనబడుతోంది.