ఆంధ్రాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా ఇంటింటికీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో టీడీపీది ప్రతిపక్షం కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు. అయితే, ఇప్పటికే పొత్తుల విషయమై టీ టీడీపీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న విభేదాలన్నీ పక్కనపెట్టి పనిచేయాలనే అధినేత చంద్రబాబు ఆదేశాలు నేతలపై బాగానే పనిచేసినట్టుగా పైపైకి కనిపిస్తోంది. ఈ సమావేశంలో ప్రముఖ నేతలు మాట్లాడారు. పొత్తుల గురించి ఎవ్వరూ ప్రస్థావించే ధైర్యం చేయలేదు. కానీ, మోత్కుపల్లి నర్సింహులు మాత్రం అన్యాపదేశంగా చెప్పాలనుకున్నది చెప్పేశారు!
పార్టీ యంత్రాంగమంగా చురుకైన పాత్ర పోషించి, ఈ ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఆ తరువాత రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అన్నట్టుగా సాగిందనీ, ఎంతో విద్యార్థుల ఆత్మబలిదానంతో సాధించుకున్న తెలంగాణ ఇది అన్నారు. వచ్చిన రాష్ట్రంలో ఇవన్నీ పక్కన పెట్టేసి, బర్రెలు గొర్రెలు చేపలు చీరలకు దిగజారిపోయిందీ అని ఘాటుగా విమర్శించారు. పేదలను పేదలుగానే ఉంచాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఆ తరువాత, మోత్కుపల్లి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీకి బలమైన కేడర్ ఉందన్నారు. ఎవరి మద్దతూ లేకుండా ఎన్నికలకు వెళ్తే ఇరవైయ్యో ముప్పయ్యో సీట్లు గెలుచుకోగలం అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తరువాత మన మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్నారు.
టీ టీడీపీలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్న ఆ తరుణంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని నేతలు ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తారనేది వేచి చూడాలి. ఎవ్వరితో పొత్తు అవసరం లేదన్నట్టుగా మోత్కుపల్లి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ తో అవసరం అన్నట్టుగా రేవంత్ మనోగతం ఉంది! పైగా, తెరాసతో పొత్తు అంటూ చెలరేగిన లొల్లితో రేవంత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. పొత్తులపై స్పష్టత ఉంటే బాగుంటేందనే అభిప్రాయం పార్టీలో చాలామందిలో ఉంది. కనీసం రాష్ట్రంలో భాజపాతో పొత్తు వద్దనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో ఉంది. అయితే, వాటి గురించి తరువాత మాట్లాడుకుందాం అని చంద్రబాబు వాయిదా వేశారు. ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇంకోపక్క ఎన్నికలకు సన్నద్ధం అంటూ ఇంటింటికీ కార్యక్రమం మొదలుపెట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు తెరాసపై విమర్శలు చెయ్యొచ్చా, కాంగ్రెస్ తీరుపై మండిపడొచ్చా, భాజపా విధానాలను తప్పుబట్టొచ్చా.. ఇలాంటి సందిగ్దత కొంతమందిలో ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని ఎవరికివారు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి.