నిన్నటి నుంచి ప్రారంభమైన కృష్ణా పుష్కరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపిలు గత రెండు వారాలుగా చాలా మంది ప్రముఖులని స్వయంగా ఆహ్వానించారు. అదేమీ విచిత్రమైన విషయం కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రభుత్వం ఆహ్వానించాలనుకొంది. దాని కోసం ఆయన అపాయింట్మెంట్ కావాలని మంత్రి రావెల కిషోర్ బాబు కార్యాలయం నుంచి జగన్ కార్యాలయానికి గురువారం సాయంత్రం ఫోన్ వచ్చింది. ఆ సమయంలో జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకి వెళుతున్నందున శనివారం ఉదయం వచ్చి కలవవచ్చని జగన్ ప్రతినిధి తెలిపారు. కానీ మంత్రి రావెల, విప్ రవికుమార్ శుక్రవారం సాయంత్రం జగన్ నివాసం లోటస్ పాండ్ కి వెళ్ళారు. జగన్ లేరని తెలుసుకొని వారు తిరిగివెళ్ళిపోయారు.
జగన్మోహన్ రెడ్డిని పుష్కరాలకి ఆహ్వానించాలనుకోవడం మంచి విషయమే. కానీ జగన్ ఊళ్ళో లేరని తెలుసుకొన్న తరువాత ఆయన ఇంటికి వెళ్ళడమే విచిత్రం. ఆ విషయం ఫోన్ చేసి తెలుసుకొన్నారు కనుక కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవడానికి కూడా లేదు. కృష్ణా పుష్కరాలు శుక్రవారం తెల్లవారుజామున మొదలయ్యాయి. పుష్కరాలు మొదలైన 12గంటల తరువాత జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదన్న విషయం గుర్తుకు వచ్చి తమ తప్పు లేకుండా ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఊళ్ళో లేరని తెలిసినా మంత్రి హడావుడిగా లోటస్ పాండ్ కి వెళ్లివచ్చారేమో? కృష్ణా పుష్కరాలని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది కనుక ప్రముఖులందరినీ ఆహ్వానించాలనుకోవడం మంచి విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డిని మరిచిపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఇంతవరకు పట్టించుకొని జూ.ఎన్టీఆర్ ని ఆహ్వానించినప్పుడు ఊహాగానాలకి తావిచ్చింది.