కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీ వర్గాలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఎంత చెప్పినా ఆయన వినకపోవడంతో నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మొత్తం బాధ్యతల్ని వేరే టీడీపీ నేతకు అప్పగించే అవకాశం ఉంది. కొలికపూడి వ్యవహారంపై ఇప్పటికే ఎంపీ శివనాథ్ తో పాటు ముగ్గురు నుంచి నివేదిక తెప్పించుకున్నారు.
కొలికపూడిపై పది నెలల్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ దందాల్లాంటివి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఉన్నా లేకపోయినా తిరువూరు నియోజకవకర్గంలో పార్టీలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకుని వ్యవహరించాల్సిన ఆయన పూర్తిగా దారి తప్పారు. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇంకా దారి తప్ప అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఆయన పార్టీకే అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది.
నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీకి చేస్తారా.. ఎమ్మెల్యే పదవికి కూడా చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నలభై ఎనిమిది గంటలు పూర్తయ్యాయి..కాబట్టి కొలికపూడి రాజీనామా చేయాలని లేకపోతే తామే ఏదో ఓ నిర్ణయం తీసుకుంటామని టీడీపీ పెద్దలు చెబుతున్నారు. మొత్తంగా కొలికపూడి వ్యవహారం పై.. పది నెలల్లో జరిగిన పరిణామాలతో నివేదికను చంద్రబాబుకు సమర్పించనున్నారు. ఆయనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.