ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై పోరాటంలో కీలక పాత్ర తీసుకోబోతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ తరపున.. టీడీఎల్పీ ఉపాధ్యక్షునిగా ఆయనే లీడ్ తీసుకోనున్నారు. చంద్రబాబు సూపర్ విజన్ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై … అధికార పార్టీని ఇరుకున పెట్టే అంశాలను చర్చకు తేవడంపై.. అచ్చెన్నాయుడు ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నారు. సహచర శాససనసభ్యులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అజెండానుఖరారు చేసుకుంటున్నారు.
నిజానికి అచ్చెన్నాయుడు గొంతు మాత్రమే కాదు విషయ పరిజ్ఞానం కూడా భారీగానే ఉంటుంది. ఆయన ఎదురు దాడి చేసే విధానాన్ని అధికార పక్షం అడ్డుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువగా అచ్చెన్నాయుడిపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూంటారు. బాడీ షేమింగ్ చేస్తారు. అయినప్పటికీ.. అచ్చెన్న ఎదురునిలబడి ప్రశ్నిస్తూనే ఉంటారు. గత అసెంబ్లీ సమావేశాలకు ఈఎస్ఐ స్కాం పేరుతో అచ్చెన్నను అరెస్ట్ చేశారు. రెండున్నర నెలలు బెయిల్ రాకుండా జైల్లో ఉంచినా.. ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకున్నట్లుగా ఆధారాలు లేవని ఏసీబీ అధికారులే కోర్టుకు చెప్పారు. దీంతో ఆయనను ఎదుర్కోలేకే.. అలా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా మారనున్నాయి. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ.. అవి పేరుకు మాత్రమే ఉన్నట్లుగా ఉన్నాయి. మార్చిలో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను స్థానిక ఎన్నికల కోసం వాయిదా వేశారు. కానీ.. కోవిడ్ లాక్ డౌన్ విధించడంతో సాధ్యం కాలేదు. రెండు సార్లు బడ్జెట్‌కు గవర్నర్ సంతకం ద్వారా పొడిగింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా సమావేశాలు పెట్టి… ముగించారు. ఆ సమావేశాల్లోనే రెండో సారి రాజధాని బిల్లులను ఆమోదించారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడే పెడుతున్నారు. ఈ కారణంగా అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.