కొద్ది రోజుల కిందటి వరకూ వైసీపీకి బిజెపితో కొత్తగా దోస్తీ పెరిగినట్టు కథనాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడవన్నీ ఆగిపోయినట్టేనా? ఈ కథనాలపై తెలుగుదేశం ఇబ్బంది పడుతుంటే బిజెపి నేతలు కొందరు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. వెంకయ్య నాయుడిని పదోన్నతితో పక్కన పెట్టేశాక ఇక ఎపి రాజకీయాల్లో టిడిపితో అతిస్నేహం ఆగిపోయినట్టేనని సంకేతాలు ఇచ్చారు. జాతీయ స్థాయి సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించి అన్ని అవకాశాలు అట్టిపెట్టుకున్నట్టు అనధికార మీడియాలో కథనాలిచ్చారు. ఆఖరుకు నంద్యాల పోలింగ్ ముందురోజైతే వైసీపీ బిజెపిలో కలిసి పోతున్నట్టే కథనం వచ్చింది. తాము బిజెపితో అధికారికంగా అవగాహనకు వచ్చే అవకాశం లేదని అంతర్గతంగా వివరిస్తున్న వైసీపీ ఈ ప్రచారాన్ని కావాలనే సాగనిచ్చింది. టిడిపిని తికమక పెట్టడానికి ఇది ఆయుధంగా వుపయోగపడుతుందని అంచనాతో ఆస్వాదిస్తూ కూచుంది. బిజెపి సంతోషం కోసం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్రం పాత్రపై చర్చ నామకార్థంగా మార్చింది. కాని నంద్యాల పలితం రాగానే స్వయానా ప్రధాని మోడీ విజేత భూమా బ్రహ్మానందరెడ్డిని అభినందిస్తూ తెలుగుదేశం తమ విలువైన నేస్తం అని ట్వీట్ చేయడం కీలక పరిణామం. తమ మైత్రిపై వూహాగానాలకు తెరదించాలనే ఆయన ఈ పని చేశారన్నది స్పష్టం. ఈ సమయంలోనే మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇలాటి వివరణే ఇచ్చారు. ఒక దశలో ఆమే వైసీపీలో చేరతారని కథలు వస్తుంటే తెలుగు360లో నేను ఆ అవకాశం లేదని రాసిన సంగతి గుర్తుండి వుంటుంది. ఇప్పుడు ఆమె అసలు వైసీపీతో పొత్తుకే అవకాశం లేదని చెప్పడం ఆసక్తికరం. బిజెపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చి వుండకపోతే ఇదంతా జరగదు. తాము భాగస్వాములను మార్చే అవకాశం లేదని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పష్టం చేయడం కూడా ఇందువల్లనే. కనుక ఎపి రాజకీయాల్లో ఒక వూహాత్మక చర్చ ముగిసినట్టే భావించాలి. అయితే కేసుల్లో చిక్కుకునే వున్న జగన్ బిజెపితో ఏర్పడిన సంబంధాన్ని వదులుకుంటారని కాదు. ఎంపి విజయసాయి రెడ్డి బిజెపి నేతలతో నిరంతరం సంబంధం కలిగివుంటున్నారు. బిజెపి కూడా టిడిపితో వుంటూనే వైసీపీని కూడా దగ్గరగానే నడిపిస్తుంటుంది. అది దాని అవసరం.