రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇక కేంద్రాన్ని ప్రాధేయపడేది లేదనీ, విభజన చట్టంలో హామీల అమలుకోసమే పోరాడతామనీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో “ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హదా” కథ ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో, బిజెపి నాయకులు బహిరంగ సమావేశాల్లో ” ఎపికి చాలా చేశాం, ఇంకా చేస్తాం, హోదా కుదరదు, అయినా ఆలోచిస్తున్నాం” లాంటి పొడుగు కథలూ, పిట్టకథలూ చెబుతూ కేంద్రం హోదా ఇవ్వబోవడం లేదని సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా చేశారు.
హోదా సంజీవని కాదని చంద్రబాబు, బిజెపి నాయకులూ అన్నారు. చంద్రబాబు వైఖరివల్లే హోదా వావడం లేదని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విమర్శించడంతో హోదా పై కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు పెట్టిన ప్రయివేటు మెంబరు బిల్లుకి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. అది ఓటింగ్ కే రాలేదు.
ఈ నేపధ్యంలో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమానికి హాజరయ్యారైన చంద్రబాబు విలెకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరమూ రూ.16 వేల కోట్ల బడ్జెట్ లోటు ఏర్పడుతోందన్నారు. కేంద్రం ఈ కాలంలో రాష్ట్రానికి రూ.1,976 కోట్లు అందించిందని, అవసరమైన మేరకు మరిన్ని నిధులు అందించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇక కేంద్రాన్ని ప్రాధేయపడేది లేదనీ, విభజన చట్టంలో హామీల అమలుకోసమే పోరాడతామనీ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమ పథకాల అమల్లో రాజీపడబోమన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమ పథకాల అమల్లో రాజీపడబోమన్నారు.
ముఖ్యమంత్రి స్పష్టీకరణ ద్వారా ప్రత్యేక హోదా కోసం ”పోరాటం” నుంచి తెలుగుదేశం బయటకి వచ్చేసింది. బిజెపి ముందుగానే చేతులు ఎత్తేసింది. తోడుదొంగలని తెలుగుదేశం బిజెపిలను దుమ్మెత్తిపొయ్యడానికి ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికింది. రాజకీయప్రయోజనాల కోసం ప్రజలప్రయోజనాలను అటకెక్కించిన అన్ని పార్టీలనూ చూస్తూ ఆంధ్రప్రదేశ్ తెల్లబోయింది