విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు చంద్రబాబు టిక్కెట్ నిరాకరించారు. బీకామ్‌లో ఫిజిక్స్ అంటూ.. జలీల్ చేసిన హడావుడికి.. ప్రజల్లో ఆయన ఇమేజ్ మైనస్ అయిందని అనుకున్నారో.. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించాలనుకున్నారో కానీ… జలీల్ ఖాన్ కుమార్తెకు.. టిక్కెట్ ఖరారు చేశారు. అమెరికాలో సెటిలైపోయిన జలీల్ కుమార్తె.. రాజకీయాల్లోకి వచ్చేందుకు కుటుంబంతో సహా ఇండియాకు మకాం మార్చేశారు. అటు మైనార్టీ.. ఇటు మహిళా కోటా కూడా కలసి వస్తూండటం.. ఉన్నత విద్యాధికురాలు, సమస్యలపై స్పందించే అవగాహన ఉండటంతో.. చంద్రబాబు.. జలీల్ ఖాన్ కుమార్తెకు అవకాశం కల్పించారని భావిస్తున్నారు.
జలీల్ ఖాన్ 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చియ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరవాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. జలీల్ ఖాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఎంపిక చేశారు. కానీ ఈ సారి మాత్రం పోటీకి చాన్స్ లేదని చెప్పడంతో .. కుమార్తెను రాజకీయాల్లోకి తెచ్చారు. అయితే.. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదని అంటున్నారు. తన బదులు తన కుమార్తె పోటీ చేస్తారని, తానే దగ్గరుండి అన్నీ నడిపిస్తానని జలీల్ ఖాన్ చెబుతున్నారు. సీటు ఇస్తే గుంటూరు వెళ్లి కన్నా లక్ష్మీనారాయణ పై పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు.
అవగాహన లేకుండా వివాదాస్పదమైన ప్రకటనలు చేయడంతో.. జలీల్ ఖాన్ లో సీరియస్ పొలిటిషియన్‌ను చూడటం మానేశారు. మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్న ముఖ్యమంత్రి దృష్టిలో మొదటగా జలీల్ ఖానే ఉన్నారని.. అయితే.. బీకామ్‌లో ఫిజిక్స్ వ్యవహారంతో… ఆయనను మంత్రిని చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను వక్ఫ్ బోర్డ్ పదవితో సరిపెట్టారని…అంటున్నారు. పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్లీ టిక్కెట్ నిరాకరించలేని పరిస్థితి..అందుకే.. ఆయనకు కాకుండా.. ఆయన కుమార్తెకు … టిక్కెట్ సర్దుబాటు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.