తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులు ఖరారైనప్పుడు చాలా మంది ఉభయగోదావరి జిల్లాలపై వైసీపీ పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందేనని అనుకున్నారు. అయితే తాము రిజర్వుడు నియోజకవర్గాల్లో సత్తా చూపిస్తామని వైసీపీ నేతలు అనుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితి కూడా లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండురోజుల పాటు ఉమ్మడిగా చేసిన ప్రచారం హోరెత్తిపోయింది. ప్రచారం చేసిన పట్టణాలన్నీ కిక్కిరిసిపోయాయి.
పవన్ కల్యాణ్‌పై గత ఐదేళ్లుగా జరిగిన వ్యక్తిగత దాడితో గోదావరి జిల్లాల్లో ఆయన అనుకూల వర్గం రగిలిపోతోంది. ఓటుతో తమ స్పందన తెలియచేయాలన్న ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికీ పవన్ పై కొంత మంది నేతల్ని ఉసిగొల్పి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి..జనసేనను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా ఆ వర్గంలో ఆగ్రహానికి కారణం అవుతోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన కలిసి ఉంటే.. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించి ఉండేవారు. అప్పుడు జగన్ వేవ్ ఉన్నా… కనా కష్టంగా చాలా నియోజకవర్గాల్లో గట్టెక్కారు. ఈ సారి జగన్ పై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వాన్ని సాగనపాల్సిందేనన్న పట్టుదల కనిపిస్తూండటం.. అదే సమయంలో ఓట్లు చీలిపోకుండా కూటమిగా వస్తూండటంతో.. గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.
పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు… టీడీపీ, జనసేన నేతలకు కళ్లు తిరిగే ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనీ మ్యాజిక్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని వైసీపీలో చేరే కొంత మంది నేతలు సైలెంట్ అవుతున్నారు. కానీ వీరు అంతర్గతంగా కూటమికే పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రెండు విధాలుగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వుడు నియోజవకర్గాల్లోనూ వైసీపీ వీక్ గా కనిపిస్తోంది.. ఈ సారి రంపచోడవరంలోనూ అనంతబాబు తిరిగితే తిరుగుబాటు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. సగం నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్లు కూడాకష్టమన్న అభిప్రాయం ఉంది. కూటమి అభ్యర్థులకు యాభై వేలకుపైగానే మెజార్టీలు అంచనా వేస్తున్నారు.