చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు పూర్తయ్యాయి. సీట్ల సంఖ్య, వాటిలో పోటీ చేసే అభ్యర్థుల అంశంపైనా రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. రెండు పార్టీలూ ఫైనల్గా ఓ అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారన్నది అధికారికంగా ప్రకటించడం కాకుండా.. ఒకే సారి రెండు పార్టీలు అభ్యర్థులతో సహా జాబితా విడుదల చేయాలని అనుకుంటున్నాయి.
ఆశావహుల్ని ముందస్తుగా బుజ్జగించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన క్యాడర్ ఆశావహులు ఉన్నందున ముందుగా వారికి సర్ది చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు. జనసేన పార్టీ తరపున కొన్ని బలమైన స్థానాల్లో కూడా కొంత మందిని బుజ్జగించే అవకాశం ఉంది. ఎవరి సిట్టింగ్ సీట్లు వారికే ఉంచుకోవాలన్న ప్రాథమిక నిబంధనను ఇరువురూ అంగీకరిచినట్లుగా తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటు ప్రకటన.. అనంతరం.. పార్టీ నేతలు ఎలాంటి రచ్చ చేయకుండా ముందే సర్ది చెప్పనున్నారు. ఇబ్బంది అయితే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని అలా కాకుండా పార్టీకి నష్టం కలిగేలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల అంశంపై ఓ స్పష్టత వచ్చినందున.. ఇక అంతర్గతంగా ఎన్నికల సన్నాహాలు .. ప్రచార కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసే అవకాశం ఉంది.