సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసే పొల్యూషన్ ఎక్కువైపోతోంది. గతంలో అందరూ కలిసి వైసీపీ మీద .. జగన్ మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు జగన్ పెద్దగా కనిపించకపోవడంతో వారికి పని లేక ఒకరిపై ఒకరు పోరాడుకుంటున్నారు. వారి ఎజెండా వేరు. వారికి పార్టీ అనేది ఓ కవచం మాత్రమే. తమ ఈగోల కోసమే ఎక్కువ మంది కొట్లాడుతున్నారు. ఈ పరిస్థితి రాను రాను ఘోరంగా మారుతోంది.
ఘోరంగా తిట్టుకుంటున్న సోషల్ సైన్యాలు
సోషల్ మీడియా సైన్యాలు.. ఓ పార్టీ అధినేతను విమర్శిస్తాయి. దానికి ప్రతిగా మరో పార్టీ అధినేతను ఇతర పార్టీల విమర్శిస్తారు. అక్కడ్నుంచి అది వ్యక్తిగత జీవితాలవైపు వెళ్తుంది. కేసులు పెట్టబోతున్నాం కాస్కోండి అనే బెదిరింపుల దాకా సాగుతాయి. ఎంత ఘోరంగా వీరు సోషల్ వారు చేసుకుంటున్నారంటే.. రోజంతా అదే పని. ఇతర పనులేం లేనట్లుగా.. తిట్టుకుంటూ ఉంటారు. అందులో ఒక్క ప్రజాప్రయోజనమైన ట్వీట్ ఉండదు.
పార్టీలను కవచంగా వాడుకుంటున్న వైనం
ఆయా సోషల్ మీడియా కార్యకర్తలు తాము అభిమానిస్తున్నాం అంటూ కొన్ని పార్టీలను అడ్డం పెట్టుకుంటున్నాయి. నిజంగా వారికి ఆయా పార్టీలపై అభిమానం.. ఆయా పార్టీ అధినేతలపై ఇష్టం ఉంటే.. వారిని ఇలా ఇతర పార్టీలతో తిట్టించరు. కానీ ఎదుటి పార్టీ అధినేతను తిడితే వారు తమ పార్టీ అధినేతను తిడతారని తెలిసి కూడా.. తమ ఈగో శాటిస్ ఫై చేసుకోవడం కోసం.. పార్టీని, అధినేతల్ని తిట్టించడానికి వెనుకాడటం లేదు. వీరి వల్ల ఆయా పార్టీలకు ఒక్క ఓటు ఉపయోగం లేకపోగా.. సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చ చూసి అందరూ అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.
వీరెవరూ పార్టీ కంట్రోల్లో ఉండరు !
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వీరెవరూ ఆయా పార్టీల కంట్రోల్ లో ఉండరు. ఉండాలని చెప్పినా పట్టించుకోరు. ముందుగా చెప్పినట్లుగా వీరికి పార్టీ, అధినేతపై అభిమానం అనే దాన్ని కవచంగా వాడుకుంటారు. వారి వ్యక్తిగత స్వార్థం కోసమే వారు ట్వీట్లు.. పోస్టులు పెడతారు. ఇలాంటి వారి పొల్యూషన్ ఎక్కువైపోతేంది. తాను టీడీపీ అని..తాను జనసేన అని చెప్పుకుని ఇలాంటి రెచ్చిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి వారి పొల్యూషన్ ను అరికట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.