కూటమి పార్టీల క్యాడర్ కు జనవరి ఒకటో తేదీన గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఆ రోజున నామినేటెడ్ పోస్టుల మరో జాబితాను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికి రెండు జాబితాలు ప్రకటించింది. అయితే మూడో జాబితా మాత్రం అన్నింటి కన్నా పెద్దదిగా ఉంటుంది. అత్యధిక ఛైర్మన్ పోస్టులను భర్తీ చేసే విధంగా ఉంటుంది. భర్తీ చేయని కార్పొరేషన్ ఛైర్మన్లు, దేవాలయాల పాలకమండళ్ల ఛైర్మన్లు, సభ్యుల నియామకాలకు కూడా జాబితాలో స్ధానం కల్పించనున్నారు.
నియోజకవర్గాల స్థాయిలో మార్కెట్ కమిటీలకు ఈ నెలాఖరులోగా జాబితాను ఫైనల్ చేసే అవకాశముంది. ఆలస్యమైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 9న జాబితా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ సారి జాబితాలో మార్కెట్ కమిటీలు, సహకార సంస్థలు, రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండళ్లు, మత్స్యకార సొసైటీలు, ఆప్కాబ్ ఛైర్మన్ లాంటి పదవులు కూడా ఉంటాయని చెబుతున్నారు.
జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి పదవులను ఆయా ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తున్నారు. నియోజకవర్గ పోస్టుల్లో 34 శాతం బిసిలకు ఇస్తున్నారు. ఇప్పటికే లోకేష్ టీం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ అంగీకరించిన ఫార్ములాలోనే బీజేపీకి, జనసేనకు పదవులను కేటాయించనున్నారు.