ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్ సిక్స్ పథకాలకు తోడు మరికొన్ని కీలక హామీలను ప్రకటించారు.
అమరావతి నిర్మాణం, మెగా డీఎస్సీ, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం సహా కీలక హామీలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జూన్ లో ప్రభుత్వం ఏర్పడగానే మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇస్తారు. మైనార్టీలకు మంచి హామీలు ఇచ్చారు. హజ్ యాత్రకు రూ. లక్ష సాయం, ఈద్గాలు, ఖబరిస్తాన్ల కోసం స్థలాలు ,విజయవాడ సమీపంలో హజ్ హౌస్ , నూర్ బాషా కార్పొరేషన్‌కు ఏటా 100 కోట్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణాలు , ఇమామ్‌లకు పదివేలు, మౌజామ్లకు ఐదు వేలు గౌరవేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అర్హత ఉన్న ఇమామ్‌లకు ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తారు. మసీదుల నిర్వహణకు నెల ఐదువేల ఆర్థిక సాయం అందిస్తారు.
ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా 50 వేలు కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆదరణ కింద ఐదు వేల కోట్లు ఖర్చు , వారసత్వ వృత్తిపై ఆధార పడే వాళ్లకు ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఆధునీకరణలో వారిని ఇన్వాల్వ్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. చేనేత పరిశ్రమకు ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు పవర్ లూమ్స్‌కు ఐదు వందల యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి 24000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దేవాలయాల్లో పని చేస్తున్న నాయినబ్రాహ్మణులకు గౌరవేతనంగా 25000, షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం , గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు , వడ్డెర్లకు క్వారీల్లో 15 రిజర్వేషన్ ఇస్తాం. రాయల్టీ, సీన్రీ ఛార్జీల్లో మినహాయింపు ఉంటుందన్నారు.
రజక, దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు, దోబీ ఘాట్ల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20 వేల ఆర్థిక సాయం చేస్తాం. 217 జీవో రద్దు, కొత్త బోట్లు, ఉన్న బోట్ల మరమ్మతులు చేపించడం , స్వర్ణకారుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ పథకాలు అమలు చేస్తారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎన్నికైన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4000కు పెంచుతామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 6000 ఇస్తామన్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 చొప్పున ఇస్తామన్నారు. ఉచిత ఇసుక ఇవ్వడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, బీసీ రక్షణ చట్టం, చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ, పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, పెళ్లి కానుక 1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారు.