కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎంఎల్‌సి అభ్యర్థిగా కెఇ ప్రభాకర్‌ను ఎంపిక చేయడం కొంతకాలంగా అసంతృప్తిగా వున్న ఉప ముఖ్యమంత్రి కెఇకృష్ణమూర్తి కుటుంబానికి సంతోషం కలిగించే పరిణామం. సుదీర్ఘ కసరత్తు అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఈ నిర్ణయం వెనక రాజకీయ సామాజిక కోణాలున్నాయి. దీర్ఘకాలంగా రాజకీయాల్లో పట్టు కొనసాగిస్తున్న ఈ కుటుంబాన్ని సంతోషంగా వుంచితేనే వెనకబడిన వర్గాలలో టిడిపి బలం కాపాడుకోగలమన్న అంచనా ఇందుకు కారణంగా కనిపిస్తుంది. అంతేగాక ఈవైఎస్ఆర్సిపి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం వారి నెత్తిమీద పాలుపోసినట్టుగా తయారైంది. స్థానిక సంస్థల్లో తమవారే ఎక్కువగా వున్నా టిడిపి నీతిబాహ్య విధానాల కారణంగా తప్పుకుంటున్నట్టు వైసీపీ పేర్కొంది. అయితే పాలక పక్షం ప్రలోభాల ముందు తమ శిబిరాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదన్న అంచనాయే ఇందుకు కారణమనేది స్పష్టం. గతసారి ఇక్కడ శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపి అభ్యర్థిగానే విజయం సాధించారు. తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన తన అన్న మోహనరెడ్డికి మద్దతుగా శాసనమండలికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా నైతిక విలువలకు ప్రతిబింబం అని వైసీపీ ప్రత్యేకంగా ప్రచారం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.జగన్ ఒత్తిడిపై అయిష్టంగానే ఆయన రాజీనామా చేశారని అందరికీ తెలుసు. అన్నదమ్ముల అనుబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు కుటుంబ సంబంధాలు ఆ రాజీనామాకు దారితీశాయి. అయితే ఆ ఎన్నికల్లో సామదానభేద దండోపాయాలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో మరోసారి పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడం పరాజయం మూట కట్టుకోవడం ఎందుకుని శిల్పా కుటుంబం భావించినట్టు తెలుస్తుంది. కెఇ ప్రభాకర్ ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు. ఆ మేరకు ఇది టిడిపికి ఉత్సాహం కలిగించే విషయమే.