హైదరాబాద్: రిజర్వేషన్లకోసం రేపటినుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోబోతున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలు ప్రారంభించింది. తమ పార్టీకి చెందిన కాపు ప్రముఖులను ముద్రగడ వద్దకు రాయబారానికి పంపింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ తోట నర్సింహం, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడను కలవనున్నారు. ముద్రగడ నిరాహారదీక్ష నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తోట త్రిమూర్తులును రంగంలోకి దించారు. ఆయన నిన్న గోదావరి జిల్లాలలోని కాపునేతలతో పలు దఫాలు సమావేశమయ్యారు… మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై సీఎమ్ సానుకూలంగా ఉన్నారని, ఆందోళనలు అవసరం లేదని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చటం ఇప్పటికిప్పుడు తేలిపోయే అంశం కాదని అన్నారు. ఇదిలాఉంటే జగ్గంపేట సీఐ ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడను ఆయన స్వగృహంలో కలిసి చర్చలు జరిపారు. తర్వాత ముద్రగడ అనుచరులతో కూడా విడిగా మాట్లాడారు. అటు కిర్లంపూడి ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కాపులు కిర్లంపూడి రావద్దని ఎస్పీ రవిప్రకాష్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.