ప్రత్యేకహోదా ఇస్తారా..? లేదా..? సూటిగా చెప్పాలని… రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీఆజాద్ … హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. కానీ రాజ్ నాధ్.. సూటిగా కాకుండా సుత్తి అంతా చెప్పి తప్పించుకున్నారు. “యస్ ఆర్ నో” ఏదో ఒకటి చెప్పాలని ఎంతగా రెట్టించినా… రాజ్ నాథ్ కు మాట పెగల్లేదు. చివరికి వెంకయ్య రాజ్యసభను వాయిదా వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే సమాధానాలే చెప్పింది.నిజంగా చెప్పాలంటే..ఇంకా కొంచెం ఎక్కువే చెప్పింది. ఏపీ బీజేపీ నేతలు 80 శాతం హామీలు నేరవెర్చామని చెప్పుకుంటూ ఉంటారు. రాజ్ నాథ్ మరింత ఎక్కువగా.. 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకొచ్చారు.
స్వల్పకాలిక చర్చ కోసం టీడీపీ ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ అంగీకరించండంతో సుజనా చౌదరి చర్చను ప్రారంభించారు. కేంద్రం ఏపీని మోసం చేసిందని సమస్యలన్నీ ఏకరవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాదనకు పూర్తి మద్దకు ప్రకటించింది. ఏపీతో నాకెంతో అనుబంధం ఉందని చెప్పుకున్న గులాబీ నబీ ఆజాద్.ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం అక్కడి ప్రజలు కోరుకోవడం ఎంత సమంజసమో.. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం అంతే సమంజసమని తేల్చారు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ నేతలే అడిగారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం దేశాన్ని, పార్లమెంట్‌ను, ఏపీని మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ తరపున మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు తాను మీడియా సమావేశాల్లో చెప్పే రాజకీయ విమర్శలను రాజ్యసభలో మళ్లీ చదివారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఈ అంశంపై మాట్లాడిన పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి. బీజేడీ, టీఆర్ఎస్ చివరికి అన్నాడీఎంకే ఎంపీలు కూడా.. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ నిలబెట్టుకోవాలనే డిమాండ్ చేశాయి. .
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఓబ్రెయాన్ బీజేపీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. కలిసున్న పార్టీలతో ఒక రకంగా..రాజకీయంగా విడిపోయిన పార్టీలతో.. మరో రకంగా వ్యవహరించడం బీజేపీ నైజమని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరగుతుందని కలిసున్న పార్టీతో..బీజేపీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుబిడ్డ సెంటిమెంట్‌తో టీడీపీ పోరాడుతోందన్నారు. తృణమూల్ తమ సభ్యుల సమయాన్ని కూడా.. టీడీపీ ఎంపీలకే కేటాయించాలని రాజ్యసభ చైర్మన్ కు విజ్ఞప్తి చేసింది. .
చర్చలో ఆర్థిక అంశాలకు సంబంధించి సమాధానం ఇచ్చిన పియూష్ గోయల్ పెండింగ్ లో ఏ ఒక్క అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా ఇవ్వొద్దని ఆయన చెప్పారు. దాంతో సీఎం రమేష్.. రాజ్యసభలో బహిరంగసవాల్ చేశారు. 14వ ఆర్థిక సంఘం… ప్రత్యేకహోదా ఇవ్వొద్దని సూచించినట్లు… ఆధారాలు చూపిస్తే.. అప్పటికప్పుడు.. రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ చేశారు. కానీ తర్వాత రాజ్ నాథ్ సింగ్ మళ్లీ ఆర్థిక సంఘం ప్రస్తావనే తెచ్చి సరిపెట్టేశారు. ఎంత పట్టుబట్టినా బీజేపీ మాత్రం ఎప్పుడూ చెప్పే సమాధానాలే చెప్పింది. చట్టంలో ఉన్నట్లు రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప, బయ్యారం ఉక్కు పరిశ్రమలపై పరిశీలన జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి చట్టసభలో మరోసారి చర్చ అయితే జరిగింది కానీ.. కొత్తగా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. కానీ పార్టీలన్నీ.. ఏపీకి మద్దతు తెలియజేయడం ఒక్కటే ఊరట నిస్తుంది.