బిత్తిరి సత్తి అని పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకుడు ఉండకపోవచ్చు. ఆ మధ్య వి6 ఛానల్ లో తీన్మార్ వార్తల తో బిత్తిరి సత్తి బాగా పాపులర్ అయ్యాడు. ఈ మధ్య వీ6 ఛానల్ నుండి టీవీ9 కి మారిపోయాడు. తాజాగా శివ జ్యోతి కూడా చేరడంతో టీవీ9 లో వచ్చే బిత్తిరి సత్తి ప్రోగ్రాం కి టిఆర్పి రేటింగులు కూడా బాగానే పెరిగాయిట. అయితే ఆ టిఆర్పి రేటింగ్ ల సంగతి ఎలా ఉన్నా, బిత్తిరి సత్తి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలలో బాగా పెరిగింది అనడానికి నిదర్శనం అయిన సంఘటన ఒకటి జరిగింది. టిడిపి నేత కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ “తమ్మినేని సీతారాం ఆంధ్ర బిత్తిరి సత్తి” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అమరావతి ప్రాంతాన్ని రాజస్థాన్ ఎడారి తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను ఆ మధ్య అమరావతి ప్రాంతం లో పర్యటించినప్పుడు ఎక్కడా అభివృద్ధి కనిపించలేదని, అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిని తలపించింది అని, అందుకే అమరావతిని పట్టుకుని వేలాడకుండా జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ను ప్రజలు స్వాగతించాలని ఆయన అన్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మారుస్తాం అంటే మూడు పంటలు పండే నేలను రాజధానిగా ఎలా మారుస్తారు అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన వై ఎస్ ఆర్ సి పి నేతలే ఇప్పుడు దాన్ని ఎడారి ప్రాంతం లా చిత్రీకరించడానికి ప్రయత్నించడం గమనార్హం. అయితే తమ్మినేని సీతారాం వ్యాఖ్యల ని తీవ్రంగా ఖండించారు టిడిపి నేత , మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్. సొంత ఊరికి రహదారులు కానీ కనీస సౌకర్యాలు కానీ కల్పించలేక పోయిన తమ్మినేని సీతారాం రాజధాని ప్రాంతాన్ని ఎడారి తో పోల్చడం సిగ్గుచేటు అని ఆయన విరుచుకుపడ్డారు. తన భార్య, కొడుకు కలిసి నియోజకవర్గంలో దోపిడి చేస్తుంటే, చేత కాని భర్త లాగా , చేత కాని తండ్రి లాగా ఉండి పోయిన వ్యక్తి రాష్ట్రానికి స్పీకర్ గా ఉండడం దురదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఆంధ్ర బిత్తిరి సత్తి ని తలపిస్తున్నాడు అని ఆయన అన్నారు.
రెండు పారడాక్స్ లు:</span?
మొత్తానికి ఇక్కడ రెండు పారడాక్స్ లు ప్రజలను ఆకర్షించాయి. మొదటిది, మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నంతసేపు వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడుతూ, మూడు పంటలు పండే అమరావతి లో రాజధానిని ఎలా కడతారు అని మాట్లాడిన వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఇప్పుడు సడన్ గా దాన్ని రాజస్థాన్ ఎడారి తో పోలుస్తూ వ్యాఖ్యానించడం.
ఇక రెండవది, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం తన సొంత నియోజకవర్గానికి కనీస సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పిన కూన రవికుమార్, అప్పట్లో ఆయన ఎమ్మెల్యే గా చేసింది తెలుగుదేశం పార్టీ తరఫునే అని మరచి పోవడం. తమ్మినేని సీతారాం 1994 లో మొదటిసారి టిడిపి తరపున ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండోసారి 1999 లో మళ్లీ టీడీపీ తరపున ఎన్నికయ్యారు. 2004 లో టిడిపి వ్యతిరేక హవా లో ఆయన కూడా కొట్టుకు పోయారు. 2009లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ లో చేరి అక్కడా ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్సిపిలో చేరి, 2014 లో వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడే 2019 లో వైయస్సార్ సిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కంటే ముందు ఆయన 1994, 1999 రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ నుండే అని మరచి పోయి టిడిపి నేత రవి కుమార్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు అని విమర్శించడం రెండవ పారడాక్స్.