ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ చైర్మన్ పదవికి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర రాజీనామా చేశారు. ఇక ట్రస్ట్‌తో తనకేమీ సంబంధం లేదని.. సంగం డెయిరీ చైర్మన్‌గా ఎవరు ఉంటారో.. ట్రస్ట్‌కు కూడా వారే చైర్మన్‌గా ఉంటారని ప్రకటించారు. ఇటీవల ఈ ట్రస్ట్ పై ప్రభుత్వం గురి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా సంగం డెయిరీ భూముల్ని.. ఆదాయాన్ని ఇస్తున్నారని.. ఆరోపిస్తూ..అసలు సంగం డెయిరీనే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే కోర్టులో వీగిపోయింది. చివరికి ట్రస్టుకు రకరకాల నోటీసులు జారీ చేస్తున్నారు.
కొంత మందితో కోర్టుల్లో పిటిషన్లు కూడా వేయించారు. చివరికి విసిగి వేసారిపోయిన ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ధూళిపాళ్ల ట్రస్ట్ .. సంగం డెయిరీకి పాలు పోసే రైతుల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉచిత వైద్యం అందించేందుకు హాస్పిటల్ కూడా నిర్వహిస్తోంది. సంగం డెయిరీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర ఆ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
నరేంద్ర నాయకత్వంలో సంగం డెయిలీ.. వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. లక్షల మంది రైతుల సంక్షేమానికి సంబంధించిన విషయం కావడంతో ఎన్ని ప్రభుత్వాలు మారినా సంగం డెయిరీ జోలికి ఎవరూ వెళ్లలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం… అమూల్ కోసం సంగం డెయిరీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. చివరికి ధూళిపాళ్ల నరేంద్ర ట్రస్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.