ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద పుష్కర్ ఘాట్ సమీపంలో గుడి కట్టేందుకు తెదేపా మండల అధ్యక్షుడు బుడ్డి సతీష్ సిద్దం అవుతున్నారు. ఆయనకి ఒక స్థానిక రైతు సహకరిస్తున్నాడు. ఈ వార్త అన్ని మీడియా చానళ్ళలో వచ్చింది. కానీ దీనిపై చంద్రబాబు నాయుడు కానీ తెదేపా మంత్రులు నేతలుగానీ స్పందించకపోవడం విశేషం.
రైతులు అందరూ స్వచ్చందంగా తమ భూములను ఇచ్చారని అందుకే 33, 000 ఎకరాలను సేకరించగలిగామని చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు గొప్పగా చెప్పుకొనేవారు. కానీ భూసేకరణలో రైతుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు రైతులతో సహా అన్ని వర్గాల ప్రజల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కొంటే సహించబోమని జగన్, పవన్ కళ్యాణ్ వంటివారు గట్టిగా హెచ్చరించిన తరువాతే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను నిలిపివేసింది. అంటే రైతుల అభీష్టానికి విరుద్దంగా బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకొన్నట్లు లేదా అటువంటి ప్రయత్నాలు చేసినట్లు స్పష్టం అయ్యింది.
చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే రైతు వ్యతిరేకి అనే బలమయిన ముద్ర ఒకటి పడిపోయింది. రాజధాని మొదలు బందరు, గన్నవరం, భోగాపురం వరకు భూసేకరణ చేస్తుండటంతో చంద్రబాబు నాయుడు పట్ల రైతులలో వ్యతిరేకత పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రైతుల పాలిట దేవుడు అనే విధంగా పార్టీ నేత ఒకరు గుడి కడుతుంటే అభ్యంతరం చెప్పడం కంటే మౌనం వహించడమే మేలు. దాని వలన చంద్రబాబు నాయుడుకి కొంత పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. బహుశః అందుకే మౌనం వహిస్తున్నారేమో. కానీ బ్రతికున్న మనుషులకు గుళ్ళు గోపురాలు, శిలావిగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అమంగళం అనే సంగతి ఆయనకి తెలియకపోదు. కనుక ఆఖరు నిమిషంలో కలుగజేసుకొని గుడి కట్టే ప్రతిపాదనను నిలిపి వేయిస్తారేమో? అయినా ఇటువంటి పనులతో మనుషులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉన్నట్లయితే అందరూ అదే పని చేసి ఉండేవారు కదా?