ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దాదాపు ఆరు వారాల తర్వాత మద్యం షాపులు తెలుసుకోవడంతో, జనాలు వైన్ షాపులకు పోటెత్తారు. షాపు ముందు ఐదు మంది మాత్రమే ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి వంటి నిబంధనలను బేఖాతరు చేసి, కిలోమీటర్ల కొద్దీ క్యూలు, ఒకరినొకరు తోసుకుంటున్న జనాల తో వైన్ షాపుల పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. దీనిపై తెలుగుదేశం నేత జవహర్ సునిశిత విమర్శలు చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్, ఇప్పుడు ఇంత అర్జెంటుగా మద్యం షాపులు ఎందుకు తెరిపించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మద్యం షాపుల వద్ద క్యూలు కట్టి, మద్యం తాగి జనాలు చచ్చిపోవాలని జగన్ కోరుకుంటున్నారా అంటూ విమర్శలు చేశారు. పలు వైకాపా నేతలు నాటు సారా తయారీ, గంజాయ్ తయారీలో భాగస్వాములయ్యారు అంటూ ఆయన ఆరోపించారు. చాక్లెట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అమ్ముతున్నారని ఆయన విమర్శలు చేశారు. కాపురాలలో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలను మద్యపానం నాశనం చేస్తోందని వై ఎస్ ఆర్ సి పి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, అలాంటిది ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి అని వైన్ షాపుల ను జగన్ ప్రభుత్వం అనుమతించింది అని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
నిజానికి దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్, లాక్ డౌన్ సమయంలో మిగతా రాష్ట్రాల కంటే ముందే వైన్ షాపులకు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. మద్యపాన నిషేధం పై చిత్తశుద్ధి ఉండి ఉంటే, కనీసం లాక్ డౌన్ సమయంలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసి ఉండేవారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.