ఏపీ రాజకీయాల్లోనూ ఏక్ నాథ్ షిండే ఉన్నారా ? ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో స్పష్టం చేశారు. అందుకే తాము జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా చేశామని కూడా ప్రకటించారు. అంతర్గతంగా ఏదో సమాచారం లేకపోతే సజ్జల ఇలా చేయరు.. జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించరని ఎక్కువ మంది నమ్మకం. ఆ షిండే ఎవరంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరునే ఎక్కువ మంది చెబుతున్నారు. టీడీపీ నేత కూన రవికుమార్ కూడా అదే చెబుతున్నారు. త్వరలో మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో అధికార మార్పిడి ఉంటుందంటున్నారు.
మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉండి…అంతర్గతంగా పనులు పూర్తి చేసుకుంటున్నారని కూన రవి చెబుతున్నారు. మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ ధాకరే వ్యవహారశైలి కారణంగానే అందరూ దూరమయ్యారు. వారందరూ బీజేపీ అండతో చీలిపోయి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ జగన్ వ్యవహారశైలి అంత కంటే దారుణంగా ఉంది. తాను బటన్లు నొక్కుతాను.. మీరంతా ప్రజల్లోకి వెళ్లి చీవాట్లు తినండి అని ఎమ్మెల్యేల్ని పోరు పెడుతున్నారు. ఓ అపాయింట్మెంట్ ఉండరు. పైసా నిధులివ్వరు. ఇలాచెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేల బాధలన్నీ లెక్కలకు మిక్కిలిగా ఉంటాయి.
దీంతో సహజంగానే వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. గతంలోనేబీజేపీ నేతలు పెద్దిరెడ్డితో పాటు బొత్సతో కూడా సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరిగింది. అయితే చివరి వరకూ బయటపడకుండా రాజకీయాలు చేయడం బీజేపీ స్టైల్, ఏక్ నాథ్ షిండే విషయంలోనూ అదే జరిగింది. ఒక వేళ పెద్దిరెడ్డి తిరుగుబాటు చేసి..బీజేపీ అండ ఉంటే.. మహారాష్ట్ర తరహా పరిణామాలు జరగబోవని చెప్పలేమని ఎక్కువ వాదన వినపిస్తోంది. కూన రవి కూడా అదే చెబుతున్నారు.