టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ సానుభూతిపరులు వాటిని పెట్టారు. అయితే అవి ఇప్పటివా.. పాతవా అన్నదానిపై స్పష్టతలేదు. ఆయన కుటుంబసభ్యులు కానీ.. టీడీపీ కానీ ఈ అంశంపై స్పందించలేదు. బెయిల్ పై వచ్చిన తర్వాత పట్టాభి ఆజ్ఞాతంలోకి వెళ్లారు.
కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ప్రాణానికి ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతోనే ఆయన వెంటనే ఆజ్ఞాతంలోకి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బెయిల్ వచ్చిన రోజున రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ ముప్పు ఉందన్న సమాచారంతో ఆయన వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయనతో పాటు వస్తున్న వాహనాలన్నింటినీ నిలిపివేశారు. కానీ పట్టాభి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అప్పట్నుంచి పట్టాభి ఎవరికీ కనిపించలేదు. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు ఆయన మాల్దీవ్స్‌కు వెళ్లారన్న ప్రచారం ప్రారంభమైంది. ఆయన ప్రాణభయంతో మాల్దీవులకు వెళ్లి ఉంటే ఉండవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పట్టాభి విదేశాలకు వెళ్లడానికి చట్టపరమైన ఆటంకాలు ఏమీ లేవు. ఆయనపై విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేంత కేసులు ఏమీ లేవు. ఆయన తన ఇష్టానికి ఎక్కడికైనా వెళ్లగలరు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆజ్ఞాతంలో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది.