హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజక వర్గానికి, అనంతపురం జిల్లాకి చేస్తున్న సేవలతో ఆయనకి, తెదేపాకు మంచి పేరు వస్తోంది. జిల్లాలో అందరి కంటే ఆయనే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ప్రజలకి ఎక్కువగా అందుబాటులో ఉంటున్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. కానీ ఆయన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ కారణంగా ఆయనకీ చెడ్డపేరు వస్తోంది. బాలకృష్ణ లేనపుడు తనే ఎమ్మెల్యే అన్నట్లుగా శేఖర్ వ్యవహరిస్తూ, జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, అధికారులతో దురుసుగా వ్యవహరిస్తున్నట్లు తరచూ పిర్యాదులు వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలితో విసిగెత్తిపోయిన చిలమత్తూరు మండల తెదేపా కన్వీనర్ రంగారెడ్డితన పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా పత్రంలో శేఖర్ కారణంగానే తప్పుకొంటున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. శేఖర్ వ్యవహార శైలి గురించి కూడా తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. శేఖర్ కారణంగా బాలకృష్ణ చేస్తున్న మంచిపనులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదం ఉందని స్థానిక తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి బాలకృష్ణ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.