మాజీ ఎంపీ సబ్బం హరి కన్ను మూశారు. ఆయన వయసు ఆరవై ఏడేళ్లు. విశాఖ జిల్లా రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు సబ్బం హరి. విశాఖ మేయర్‌గా మంచి పనితీరు కనబరిచారు. తర్వాత అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పది రోజుల కిందట కరోనా సోకినట్లు తేలడంతో… కొద్ది రోజులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే… కోలుకున్నట్లుగా కనిపించినా.. ఆయన పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
చివరికి.. ఆయన సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. కరోనా వైరస్ రాజకీయ నేతల్ని కూడా కబళిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు… మాజీ మంత్రి మాణిక్యాల రావు వంటి నేతలు చనిపోగా.., సెకండ్ వేవ్‌లో ప్రముఖులనదగ్గరవారు కూడా రిస్క్‌లో పడుతున్నారు. కుడుపూడి చిట్టబ్బాయి, బొడ్డు భాస్కర రామారావులతో పాటు.., పలువురు వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు సబ్బం హరి కూడా కరోనాకే బలయ్యారు. నిన్నామొన్నటి వరకూ.. రాజకీయాల్లో కీలకంగా ఉంటూ.. టీవీ చర్చల్లో చురుకుగా పాల్గొనే సబ్బం హరి… హఠాత్తుగా చనిపోవడం… రాజకీయ నేతలందర్ని విస్మయానికి గురి చేస్తోంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారు కావడంతో వారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. సెకండ్ వేవ్‌లో… కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతూండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ మరణాలు గుర్తు చేస్తున్నాయి.