ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరమయినప్పుడు మనుషులను వాడుకొని, అవసరం తీరగానే పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తారనే అపకీర్తి మూటగట్టుకొన్నారనేది బహిరంగ రహస్యమే. ప్రతిపక్షాలు లేదా పార్టీని వీడిన వారో ఆ ముక్క చెపితే దానికి అంత ప్రాధాన్యత ఉండదు కానీ పార్టీలో ఉన్న నేతే చెపితే నమ్మకుండా ఉండలేము. చెప్పడమే కాదు చంద్రబాబు తీరుని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలుపెట్టడం చాలా విచిత్రంగానే ఉంది. ఇంతకీ ఆయన ఎవరంటే తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం నియోజక వర్గానికి చెందిన తెదేపా సీనియర్ నేత ముత్యాల రాజబ్బాయి.
2014 ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన గట్టిగా పట్టుబడితే, తరువాత ఎమ్మెల్సీ సీటు ఇస్తానని యనమల రామకృష్ణుడు, చిన్న రాజప్ప ద్వారా చంద్రబాబు నాయుడు ఆయనని బుజ్జగించి ఒప్పించారు. కానీ ఆ తరువాత రాజబ్బాయి ఎన్నిసార్లు గుర్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు తనను పులిహోరలో కరివేపాకులా వాడుకొని పక్కన పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు కానీ కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉండి, పార్టీ కోసం పనిచేసిన తనవంటి సీనియర్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొత్తిగా పట్టించుకోవడంలేదని రాజబ్బాయి ఆగ్రహంగా ఉన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పెద్దాపురంలో తన స్వగ్రామమయిన ఆర్.బి.పట్నంలో రాజబ్బాయి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నారు. రేపు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రాబోతున్నారు కనుక తన సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇదే సమయమని భావించి దీక్షకి కూర్చోన్నారేమో. కానీ ఆయన చేస్తున్న ఈ పని వలన పార్టీకి, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి కూడా చెడ్డపేరు వస్తుంది కనుక ఈసారి బుజ్జగించే బదులు ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించినా ఆశ్చర్యం లేదు. బహుశః రాజబ్బాయి అందుకు సిద్దపడే దీక్షకి కూర్చొన్నారేమో?