మంగళగిరి నియోజకవర్గంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న లోకేష్‌కు కొంత మంది నేతలు షాక్ ఇస్తున్నారు. లోకేష్‌ను ముందు నుంచి విపక్ష పార్టీ పెద్దలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో కీలక టీడీపీ నేతలను లాగేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవి తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని చెప్పి పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయమయింది.
ఈ మేరకు పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. తనను పార్టీలోనే ఎదగనీయకుండా చేశారని విమర్శిచారు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా చివరి క్షణంలో ఆయనకు టిక్కెట్ లభించింది. అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చారు. చేనేత వర్గానికి చెందినందున అప్పట్లో అవకాశం కల్పించింది. పలువురు సీనియర్ నేతలు ఉన్నా… ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచిపోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో అవకాశం దక్కలేదు.
అయినా ఆ తర్వాత కూడా చురుగ్గానే ఉన్నారు. కానీ అనుచరవర్గం బలంగా లేకపోవడంతో ఆయన ప్రభావం తక్కువే. అదే సమయంలో నారా లోకేష్ నియోజకవర్గంలో ఆయన దృష్టిలో పడేందుకు పలువురు నేతలు దూకుడుగా పని చేస్తున్నారు. దీంతో ఆయన వెనకుబడిపోయారు. అదే సమయంలో వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.