గత మూడేళ్ల నుంచి టీడీపీ నేతల్ని అర్థరాత్రుళ్లు అరెస్ట్ చేయడం.. చితక్కొట్టడం.. తప్పుడు కేసులని కోర్టులు వదిలేయడం కామన్‌గా జరుగుతోంది. ఇలా తప్పుడు కేసులు పెట్టి కొడుతున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని చంద్రబాబునాయుడు చాలా కాలంగా చెబుతున్నారు. అరెస్టయిన వారిని ఎలాగోలా విడిపిస్తున్నారు కానీ.. పోలీసులపై ప్రైవేటు కేసులు మాత్రం పెట్టడం లేదు. అన్నీ ప్రకటనల్లోనే ఉంటున్నాయి. ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క ప్రైవేటు కేసూ నమోదు చేయలేదు.
అసలు ప్రైవేటు కేసులు ఎలా నమోదు చేస్తారో టీడీపీలో కూడా స్పష్టత లేదు. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంది. వచ్చిన ఆదేశాలను రూల్స్.. రాజ్యాంగాల్లాంటి వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దీనికి పక్కా ఆధారాలు ఉన్నాయి. న్యాయస్థానాలనూ సైతం పట్టించుకోని పరిస్థితి ఉంది. అందుకే ప్రైవేటు కేసులు వేస్తామని బెదిరించడం తప్ప టీడీపీ నేతలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు . ఈ అంశంపై టీడీపీ నేతలు కూడా ఆశక్తులుగానే ఉన్నారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం.. నిర్వీర్యమైన వ్యవస్థలు ఉన్నప్పుడు ఎవరికీ రక్షణ ఉండదు. ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి వచ్చింది. ఎవరిపై దౌర్జన్యం చేయాలనుకుంటే వారిపై టీడీపీ ముద్ర వేసి. .. పని పూర్తి చేస్తున్నారు. ఎవరికీ.. భరోసా లేదు. వీలైనంత వరకూ భయం..భయంగా సైలెంట్‌గా బతికేందుకు అందరూ సిద్ధపడుతున్నారు. అందులో టీడీపీ నేతలు కూడా ఉంటున్నారు. ఈ ప్రైవేటు కేసులు.. ఢిల్లీకి ఫిర్యాదులు.. న్యాయస్థానాల భరోసాలు ఏ మాత్రం ధైర్యం ఇవ్వడం లేదు.