కెసీఆర్, రేవంత్‌రెడ్డి, రోజా, చింతమనేని ప్రభాకర్, రావెల కిషోర్‌బాబు…..ఈ లిస్టులో ఇంకా చాలా మందే ఉన్నారు….అందరూ కూడా తిట్ల వర్షం కురిపించడంలో స్పెషలిస్టులే. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనే విషయం పక్కన పెడితే అందరి రాజకీయ మూలాలు కూడా టిడిపిలోనే ఉన్నాయి. అది కూడా చంద్రబాబు హయాంలో బాగా పేరు తెచ్చుకున్న నాయకులు. రోజా, నన్నపనేని రాజకుమారిలతో పాటు ఇంకా చాలా మంది నోరేసుకుపడిపోయే మహిళానేతలను తయారుచేసిన ఘనత చంద్రబాబుదే. బాబుగారేమో విజన్ 20-20, జపాన్, సింగపూర్ స్థాయి అభివృద్ధి, స్మార్ట్ సిటీలు, క్యాష్‌లెస్ సొసైటీ అంటూ నైసుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే వేదికపైన ఉండే ఇతర టిడిపి నాయకులు మాత్రం బూతుల వర్షం కురిపిస్తూ ఉంటారు.
జనాదరణ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనే విషయాలు పక్కన పెడితే రాయలసీమ వరకూ…మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్లో మాత్రం వైఎస్ పట్ల కాస్తంత ఎక్కువ అభిమానమే ఉంది. చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ కూడా కడప జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందాలని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నది అయిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసే పరిస్థితి. అందుకే పులిందులతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లో వైసిపికి ఉన్న జనాదరణను టిడిపివైపు మళ్ళించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు. ఎవరు ప్రారంభించారు? ఎవరు ఎన్ని నిధులు కేటాయించారు? అనే విషయం పక్కనపెడితే ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత మాత్రం చంద్రబాబుదే. అయితే చంద్రబాబు మాత్రం ఆ గొప్పదనం చెప్పుకుని రాయలసీమ ప్రజల ఆదరణను పొందడం కష్టం అన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే అరవీర భయంకరంగా బూతులు తిట్టగలిగే ఫ్యాక్షన్ లీడర్ జెసి దివాకర్‌రెడ్డి చేత జగన్‌ని తిట్టిస్తూ ఆనందపడుతున్నాడు. 2014 ఎన్నికల ముందు వరకూ కూడా పరిటాల రవిని చంపించిన నిందితుల్లో జెసి దివాకర్‌రెడ్డి పేరుని కూడా ప్రముఖంగా చెప్పారు చంద్రబాబు. జెసీ సోదరుల ఫ్యాక్షన్ చరిత్ర గురించి, క్రిమినల్ యాక్టివిటీస్ గురించి టిడిపి నాయకులే ఎన్నో సార్లు ఎంతో చెప్పారు. ఆ మాటలన్నింటినీ కూడా రాయలసీమ ప్రజలు అప్పుడే మర్చిపోయారంటే నమ్మలేం. అన్నింటికీ మించి అధికారం కోసం మాత్రమే టిడిపిలో చేరిన జెసిలాంటి వాళ్ళ మాటలకు ఉండే విశ్వసనీయత ఎంత?
చంద్రబాబునాయుడిని చాలా మంది క్లాస్ లీడర్‌గా చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు కూడా గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. మరి అదే చంద్రబాబు సమక్షంలోనే జేసి మాట్లాడే బూతులు మాత్రం బాబు ఇమేజ్‌నే డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. జగన్ అవినీతి గురించి, అనుభవం లేకపోవడం గురించి మాట్లాడితే ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. అంతేగానీ జగన్‌ని మించిన ఫ్యాక్షన్ లీడర్, క్రిమినల్ లేడని ఓ వైపు చెప్తూ…..అదే జగన్‌ని కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్స్ చేత బూతులు తిట్టిస్తూ ఉంటే మాత్రం చంద్రబాబుకు జరిగే రాజకీయ నష్టం ఆయన కూడా ఊహించలేరేమో. చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌ని ఈ బూతు మాటల రాజకీయం డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని బాబుతో పాటు టిడిపి నాయకులు కూడా ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.