తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ … చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడాన్ని.. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఓ వైపు.. టీఆర్ఎస్ విజయాన్ని వైసీపీ, జనసేన శ్రేణులు కేకుల కటింగ్ లతో, ర్యాలీలు, ఫ్లెక్సీలతో సెలబ్రేట్ చేసుకున్నాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. కేసీఆర్ … ఏపీకి వస్తానన్న ప్రకటనను… తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. పద్దతిగా ప్రకటనలు చేస్తూ.. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను మరింత రెచ్చగొట్టేలా..” ఏపీలో ప్రచారం చేసే దమ్ముందా..?” అనే ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి.
తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడాన్ని కేసీఆర్.. తెలంగాణపై చంద్రబాబు చేస్తున్న దండయాత్రగా అభివర్ణించి ప్రజల వద్దకు వెళ్లారు. మంచి ఫలితాలు సాధించారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు.. తాను ఎందుకు ఏపీకి వెళ్లనని.. ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా వేలు పెడతానని.. తనను లక్షల మంది ఏపీకి రమ్మంటున్నారని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రకటనల్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారాన్ని విమర్శించినట్లుగా .. విమర్శించబోమని.. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయడమో… ప్రచారం చేయడమో చేసుకోవచ్చని గుర్తు చేస్తున్నారు. అడపాదడపా మంత్రులు ఇదే అంశంపై స్పందిస్తున్నారు. తరచుగా సవాళ్లు చేస్తున్నారు.
ఈ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ రేపుతోంది. అందుకే.. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానన్నప్పుడు హడావుడి చేసినా.. ఇప్పుడు సంయమనం పాటిస్తోంది. వైసీపీ నేతలెవరూ దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు. తెలంగాణలో రాజకీయం … మొదట్లో ఎలా ఉన్నా చివరికి కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా మారిపోయింది. ఈ పరిస్థితి కేసీఆర్ లాభించింది. చంద్రబాబు తెలంగాణపై దండెత్తుకు వస్తున్నారని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సెంటిమెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఏపీకి వస్తే…. అదే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మొదట్లో చంద్రబాబును కేసీఆర్ సవాల్ చేస్తే సంతోష పడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు… వ్యవహారం ఏపీ రాజకీయ పార్టీల మధ్యే ఉంటే చాలని… కేసీఆర్ జోక్యం చేసుకోకపోత బాగుండుననే పరిస్థితి వస్తోంది.