ఒంగోలు ఉడికిపోయింది. కుతకుతలాడిపోయింది. మంటలు మండింది. ఇదంతా వేసవి తీవ్రత వల్ల కాదు. రాజకీయ వేడి వల్ల. గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వివాదాలు చేరడం దీనికి కారణం. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గిన రవికుమార్ కొద్ది నెలల క్రితం టీడీపీలో చేరిన దగ్గర్నుంచి, కరణం బలరాంలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఇటీవల కరణం అనుచరులిద్దరిని హతమార్చిన సంఘటనతో అది మరింత పెరిగిపోయింది. ప్రకాశం జిల్లాకు టీడీపీ అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరణం, గొట్టిపాటి ఇద్దరూ దీనికి హాజరయ్యారు. ఎదురెదురు పడ్డారు. నాయకులు కూల్‌గా ఉన్నా అనుచరులు ఉండలేరు కదా. ఇద్దరి మధ్య రగడ మొదలైంది. ఏదో అంటూ కరణం… గొట్టిపాటి మీదకు వెళ్ళడం వారిని మరింత రెచ్చగొట్టింది. కుమ్మేసుకున్నారు. ఈ క్రమంలో గొట్టిపాటి చొక్కా చిరిగిపోయింది. అక్కడికి చేరుకున్న మంత్రులు గొట్టిపాటికి నచ్చచెప్పి పంపించేశారు. దీన్ని కూడా గొట్టిపాటి అనుచరులు ప్రతిఘటించారు. కరణం మాత్రం మెత్తబడలేదు. విధిలేని పరిస్థితుల్లో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నలిగిపోయింది పోలీసులు. ఈ ఇద్దర్నీ తమాయింపజేయడం వారికి తలకు మించిన పనైంది. పోలీసుల పని బాధ్యతాయుతమైన ఇద్దరు ప్రజాప్రతినిధులు కొట్టుకోకుండా చూడడమా! ఇంతకు మించి వారికి పనిలేదా. రాజకీయాల్లో వారిలా నలిగిపోవాల్సిందేనా. రెండు బలమైన వర్గాల మధ్య ఉద్రిక్తత రాజ్యమేలుతున్నప్పుడు అపార అనుభవశీలి అయిన ముఖ్యమంత్రి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీలో ఉంటే చాలని భావిస్తోంటే ఆ విషయం చెప్పేస్తే పోయేది. ఇంతదాక తీసుకురాకుండా ఉండాల్సింది. గొట్టిపాటికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక వ్యూహం.. తనకెవరు అక్కరలేదో చెప్పడమే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి