హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ నేతలు ప్రభుత్వంపై ఇంతకాలంగా ఎన్ని విమర్శలు చేసినా మాట్లాడని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. విజయవాడ తెలుగుదేశం విజయవాడ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకన్న ఎదురుదాడికి చంద్రబాబు ఆమోదం ఉందో, లేదో ఇంకా తెలియటంలేదు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కొంతకాలంగా టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్నకూడా కన్నా, కావూరి, సోము వీర్రాజు అనంతపురంలో పర్యటిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బలహీనపడిపోయిందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శలు చేశారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. దీనిపై ఇవాళ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు భిక్ష అని, ఆయన మంత్రిపదవికోసమే ఈ విమర్శలు చేస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పారు. పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె అని చెప్పుకోటానికి తాము సిగ్గుపడుతున్నామని అన్నారు. వారాలు చేసుకుని బతికిన కావూరి వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ సున్నా లక్ష్మీనారాయణ అయిపోయారని అన్నారు. కావూరి, కన్నా, పురందేశ్వరి సోనియా గాంధి ఏజెంట్లని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలు వీరిపై దృష్టి పెట్టాలని అన్నారు. చంద్రబాబు చరిష్మావల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బాబుకు మచ్చ తెచ్చేలా మాట్లాడితో సహించబోమని వెంకన్న హెచ్చరించారు.