టివి డిబేట్ లలో , సోషల్ మీడియా డిబేట్ ల లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చర్చల్లో పవన్ కళ్యాణ్, జగన్ అభిమానుల మధ్య కాస్త వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా జగన్ మీద పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ విమర్శలు చేయడం తో వైసిపి నేతలు, వైసిపి వర్గాలు కూడా అలర్టయి తమ విమర్శల ధాటిని పెంచారు. అయితే ఈ పరస్పర వాదనలు అటు తిరిగీ, ఇటు తిరిగీ చివరికి ఒక చోట వచ్చి ఆగుతున్నాయి. అదీ ఒక్క ప్రశ్న దగ్గర. అదేంటంటే – “నువ్వు బాబు ని తిట్టవేం? నువ్వు మోడీ ని తిట్టవేం??”. వివరాల్లోకి వెళ్తే –
వైసిపి వర్గాలు పవన్ మీద జనసేన మీద చేస్తున్న ప్రధాన విమర్శ – పవన్ చంద్ర బాబు ని విమర్శించడం లేదెందుకని? ఫిరాయింపుల విషయం లోనూ, కాల్ మనీ విషయం లోనూ, ఓటుకి నోటు విషయం లోనూ ఇంకా చంద్రబాబు ని ఇరుకునపెట్టగల ఏ విషయం లోనూ పవన్ మాట్లాడడు. పవన్ పరిస్థితి చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని సాక్షాత్తూ జగనే వ్యాఖ్యానించాడు. సో, వైసిపి ప్రధాన విమర్శ, ప్రధాన అస్త్రం కూడా పవన్ చంద్ర బాబుని తిట్టడం లేదు అనేదే.
ఇక టిడిపి నేతలూ, జనసేన అభిమానులూ తరచు జగన్ మీద చేసే ప్రధాన విమర్శ – రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇవ్వకుండ, విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న బిజెపిని పల్లెత్తు మాట అనే సాహసం జగన్ చేయడం లేదు అనేది. జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినపుడు కూడా కనీస స్థాయిలోనూ మోడీ మీద, అమిత్ షా మీద , బిజెపి మీద విమర్శలు చేయకపోవడం ఈ వాదనకి బలమిస్తోంది. ఈ నేపథ్యం లోనే “నువ్వు మోడీ ని తిట్టవెందుకు” అనే ప్రశ్న ప్రత్యర్థి పార్టీల నుంచి వైసిపి మీదకి బలంగా వస్తోంది. మోడీ ని ఒక్క మాట అనడానికి ధైర్యం చాలని జగన్ ప్రత్యేకహోదా మీద పోరాటం చేస్తాననడం హాస్యాస్పదం అని టిడిపి నేతలు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
మొత్తానికి పవన్-జగన్ అభిమానుల మధ్య ఎక్కడ ఏ వాదోపవాదం జరిగినా “నువ్వు బాబు ని తిట్టవేం? నువ్వు మోడీ ని తిట్టవేం??” అనే ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగిపోతోంది. ఇంకా ఏడాదిన్నర కాలం లో ఎలక్షన్లు వస్తూండడం తో ఇలాంటి ప్రశ్నలతో ముందు ముందు డిబేట్స్ వేడెక్కనున్నాయి.