కరోనా కాలంలో కరోనా వ్యాక్సిన్.. ఇతర కట్టడి చర్యల కంటే ఎక్కువ ప్రయారిటీగా అమూల్‌కు ప్రోత్సాహం ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం పెట్టుకోవడం ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. చాలా రోజుల తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో అమూల్‌కు.. దాదాపుగా రెండున్నర వేల కోట్ల విలువైన ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఆస్తులను లీజుకివ్వాలని నిర్ణయించింది. అంత పెద్ద మొత్తంలో ఆస్తులు లీజుకు ఇస్తున్నప్పుడు… ఎంతో ఆదాయం వస్తుందని అనుకుంటారు. కానీ మూడు కోట్లకు అటూ ఇటుగానే ఆదాయం లభించబోతోంది. ఈ కారణంగానే అమూల్‌పై సీఎం జగన్ ఎందుకింత ఆసక్తి కనబరుస్తున్నారన్న అనుమానాలు.. విపక్షాల్లో ప్రారంభమై… ఆరోపణల స్థాయికి వస్తున్నాయి. జగన్ క్విడ్ ప్రో కోకు పాల్పడుతున్నారని… మరోసారి ఆయన దొరికిపోతారని.. టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
అమూల్ సంస్థ… ఇతర రాష్ట్రాల్లో పాలు సేకరించిన తర్వాత ప్రాసెసింగ్‌కి.. ఛిల్లింగ్కి.. ప్యాకింగ్‌కు ఎంత చెల్లిస్తుందో .. ఏపీ ప్రభుత్వం ఎంతకు ఒప్పకుందో వివరాలను టీడీపీ నేత పట్టాభి వెల్లడించారు. చిల్లింగ్‌కు ఇతర రాష్ట్రాల్లో అమూల్ లీటర్‌కు యాభై పైసలు ఇస్తూంటే.. ఏపీ డెయిరీ ఆస్తులు ఇచ్చి మరీ రెండు పైసలు మాత్రమే తీసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్యాకింగ్, చిల్లింగ్ రేట్లు కూడా… పది పైసలకు మించకుండానే తీసుకోవడానికి ఔదార్యం చూపారు. నిజానికి ఏపీ డెయిరీ కొన్ని జిల్లాల్లో సరిగ్గా పని చేయకపోయినప్పటికీ కొన్ని జిల్లాల్లో బాగానే పాల సేకరణ చేస్తోంది. కానీ ఆ సంస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి.. ఉద్యోగులందరికీ వీఆర్ఎస్ ఇచ్చేసి.. అమూల్‌కు కట్ట బెట్టేసింది ఏపీ సర్కార్.
అందరూ… మాజీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ను దెబ్బతీయడానికి అమూల్‌ను ప్రోత్సహిస్తున్నారని అనుకుంటున్నారు కానీ.. అంతకు మించి క్విడ్ ప్రో కో ఉందని.. కొన్ని వేల కోట్ల ఆస్తులు కాజేయడం దగ్గర్నుంచి… ఇతర క్విడ్ ప్రో కోలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని డెయిరీలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం… సంబంధం లేని అమూల్ కోసం.. ఏపీ డెయిరీ వ్యవస్థ మొత్తాన్ని అమూల్ చేతిలో పెట్టాలనుకోవడంలోనే కుట్ర ఉందన్న అనుమానాలు ప్రాథమికంగా కలగడానికి కారణం అవుతోంది. ముందు ముందు అమూల్ పాలు.. రాజకీయాల్లో మునిగి తేలడం ఖాయంగా కనిపిస్తోంది.