జగన్ జైలుకి వెళ్లాలి.. తెలుగుదేశం పార్టీ లక్ష్యాల్లో ఇదీ ఒకటేమో అనిపిస్తోంది! ఎందుకంటే, నలుగురు టీడీపీ నేతలు ఎక్కడైనా భేటీ అయితే, ఆఫ్ రికార్డ్ ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారట. సమయం సందర్భం ఉన్నా లేకపోయినా… జగన్ జైలుకు వెళ్లడం తప్పదు కదా అంటూ చర్చించుకుంటున్నారట! నిజమే, జగన్‌పై కేసులు ఉన్నమాట వాస్తవమే. విచారణ జరుగుతోంది, వ్యవహారం కోర్టుల్లో ఉంది, చట్టం తనపని తాను చేసుకుంటోంది. మధ్యలో వీరి ఉబలాటం ఏంటో అర్థం కావడం లేదన్నది కొంతమంది విమర్శ!
ఈ మధ్య ఓ టీవీ ఛానెల్‌కి మాజీ సీయస్ రమాకాంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్లో జగన్ కేసుకు సంబంధించి టాపిక్ కూడా చర్చకు వచ్చింది. జగన్ కేసుల్లో కొన్ని ప్రొసీజరల్ ల్యాప్స్ ఉన్నట్టు అభిప్రాయడ్డారు. అంటే, ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల కిందకి వస్తాయని ఆయన అభిప్రాయపడకపోయినా… బిట్వీన్ ద లైన్స్ దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తీకరించినట్టు కొన్ని విశ్లేషణలు వచ్చాయి. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఇదే టాపిక్ చర్చకు వచ్చిందట. అంటే, జగన్‌కు శిక్ష పడదేమో… తప్పించుకుంటారేమో అనే ఆందోళన దేశం నేతల్లో కాసేపు కలిగిందనీ, ఆ వెంటనే తమని తాము సమర్థించుకోవడం కోసం… ‘జయలలిత మరణించాక శశికళకు శిక్ష పడింది కదా, లాగే వైయస్ లేకపోయినా జగన్‌కు జైలు తప్పదు’ అనే కన్‌క్లూజన్‌కు దేశం నేతలు వచ్చారట!
పోలిట్ బ్యూరోలో వ్యక్తమైన ఈ అభిప్రాయమే ఇప్పుడు ఇతర దేశం నేతల మధ్యా చర్చగా మారిందని తెలుస్తోంది. అమ్మ అక్రమాస్తుల కేసులో జరిగిందే, జగన్ కేసుల్లో జరుగుతుందని కొంతమంది దేశం నేతలు అనుచరులతో విశ్లేషించి చెబుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, జయ అక్రమాస్తుల కేసులో ఓసారి జైలుకి వెళ్లారు. శశికళ కూడా జైలు జీవితం అనుభవించి వచ్చారు. ఏ పరిస్థితుల్లో జయ జైలుకు వెళ్లారు అనేది అందరికీ తెలిసిందే. ఆ కేసు పరిస్థితి వేరు. జగన్ కేసు పరిస్థితి వేరు.
తప్పుచేసినవారు ఎంతవారైనా జైలుకు వెళ్తారు. ఆ పని చేసేందుకు చట్టం ఉందీ, కోర్టులున్నాయి. ఒక రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరోలో ఇలాంటి టాపిక్స్ మీద చర్చ జరగడం అంటే… ఆ నాయకుడి మీద సదరు పార్టీకి ఉన్న అక్కసును వెళ్లగక్కున్నట్టే అవుతుంది. జగన్ జైలు ఇష్యూ అనేది టీడీపీ మ్యానిఫెస్టో అంశంగానో, లేదా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటిగానో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కొంతమంది ప్రశ్న..?