చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వల్లభనేని వంశీ, కొడాలి నాని అత్యంత దారణమైన భాషలో తిట్టిన వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. ఈ అంశం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఈ ఘటనపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. అయితే ఆయన ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. దీంతో ఆయన సూక్తులు చెప్పారన్న అభిప్రాయం వినిపించింది. టీడీపీ నేతలకు ఈ స్పందన నచ్చలేదు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు నేరుగా బయట పడుతున్నారు.
టీడీపీ నేత వర్ల రామయ్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పన్నెండుగంటల పాటు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. మేనత్తను దారుణంగా తిట్టినా ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని విమర్శించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఉందని ఈ కారణంగా ఎన్టీఆర్ పద్దతిగా స్పందించారని వస్తున్న వాదనలపైనా వర్ల రామయ్య స్పందించారు. అందరికీ సినిమాలు ఉంటాయని.. బాలకృష్ణకు లేవా అని ప్రశ్నించారు. కష్ట కాలంలో అండగా ఉన్న వారే పార్టీ సభ్యులు ఉన్నారు.
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా అలాగే స్పందించారు. ఎన్టీఆర్ స్పందన ఆది, సింహాద్రిలా ఉంటుందనుకుంటే… ప్రవచనాలు చెప్పారని మండిపడ్డారు. జూ.ఎన్టీఆర్ ఒత్తిడితోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. ఎన్టీఆర్ వల్లే వారికి టీడీపీలో చాన్సులొచ్చాయి. అందుకే ఇప్పుడు వారు దారుణంగా తిడుతున్నందున ఎన్టీఆర్ స్పందించాలన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ మాత్రం వీలైనంత సైలెన్స్ పాటిస్తున్నారు.