బందరు పోర్టు కు భూ సేకరణ విషయంలో విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు తెలుగుదేశం నేతలు, మంత్రులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అభివృద్ధికి నిరోధకంలా మారిందని తెలుగుదేశం నేతలు దేవినేని ఉమ, ఎంపీ కొనకళ్ల నారాయణలు ధ్వజమెత్తారు. బందరు పోర్టుకు తాము ప్రతిపాదించినంత భూమి కావాలని వీరు స్పష్టం చేశారు. అంత భూమి సేకరించినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని లేకపోతే కాదని రైతులు కూడా ఇష్టపూర్వకంగానే భూములు ఇస్తున్నారని తెలుగుదేశం నేతలు అన్నారు.
మరి ఇప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారు కానీ, ఇదే బందరు పోర్టు విషయంలో తెలుగుదేశం నేతల గత ప్రకటనలను ఒకసారి పరిశీలిస్తే.. ఈ వ్యవహారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బందరు పోర్టుకు వైఎస్సార్ హయాంలో భూ సేకరణ మొదలైనప్పుడు తెలుగుదేశం వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ పోర్టుకు అంత భూమి ఎందుకు?అని వీరు విరుచుకుపడ్డారు. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి.. వైఎస్ భూమినంతా దోచుకొంటున్నాడని విమర్శించాడు. బందరు పోర్టు విషయంలో భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలే నిర్వహించారు!
అప్పుడు ఈ నేతల సారాంశం ఒకటే.. పోర్టుకు అంత భూమి అవసరం లేదు, ఇంత భూమిని సేకరించడం అంటే రైతులకు అన్యాయం చేయడమే, వైఎస్ దోచుకోవడమే.. పోర్టుకు, పోర్టు అనుబంధ పరిశ్రమలకు అంతా అయినా మూడు నాలుగు వేల ఎకరాల భూమి అయితే సరిపోతుంది అని తెలుగుదేశం అధినేత స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం లక్షా ఐదు ఎకరాల స్థాయిలో మొదటగా ప్రతిపాదించింది, తర్వాత అంత కాదు.. 22 వేల ఎకరాలే.. ఈ మాత్రం భూమి లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు..అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఈ విషయంలో అభ్యంతరాలు చెబుతున్న ప్రతిపక్షం పై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి టీడీపీ వాళ్లు గతమేమాత్రం గుర్తు లేనట్టుగా భలే మాట్లాడుతున్నారే!