ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది..? నిజానికి కొత్తగా జరగాల్సిందేం లేదు. మొదట్నుంచీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతూ వచ్చిన పార్టీ, తాజాగా రేవంత్ రెడ్డి నిష్క్రమణతో మరింత డీలా పడిందన్నది వాస్తవం. అయితే, నిన్నమొన్నటి వరకూ తమకు పార్టీలో సరైన గుర్తింపు ఉండటం లేదంటూ అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్ నేతలు, ఇప్పుడు కొంత సంతృప్తితో ఉన్నారట! ఎందుకంటే, దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్న తమను కాదని, వెనక వచ్చిన రేవంత్ రెడ్డి లాంటి వారికి పార్టీలో ప్రముఖ స్థానం ఇచ్చారనీ, తమకు అవకాశం ఇచ్చి ఉంటే సత్తా చూపించేవాళ్లం అంటూ కొంతమంది నేతల మూతివిరుపులు ఎప్పటికప్పుడు ఉంటేనే ఉండేవి. అయితే, ఈ అసంతృప్తుల్ని అధినేత చంద్రబాబు ముందు ప్రస్థావించేంత సాహసం వారు ఎప్పుడూ చేయలేదు. ఓరకంగా రేవంత్ ను పార్టీ నుంచి పొగబెట్టడంలో ఈ అసంతృప్త నేతల ప్రోత్సాహం కూడా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.
రేవంత్ రెడ్డి బయటకి వెళ్లాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. పార్టీని పట్టిన పీడ వదిలేసిందనీ, ఇప్పుడు అది కాంగ్రెస్ ను పట్టుకుందని ఆయన బహిరంగంగానే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఖాళీ చేయడంతో పార్టీలో తన ప్రాధాన్యత పెరిగినట్టు ఆయన భావిస్తున్నారు. ఇక, ఇతర సీనియర్ల విషయానికొస్తే… వారిలో నయా జోష్ కనిపిస్తోంది! రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామనీ, త్వరలోనే ప్రజల్లోకి వెళ్తామనీ, శ్రేణుల్ని ఉత్సాహ పరుస్తామనీ, కేడర్ కు భరోసా కల్పిస్తామని వారు అంటున్నారు. కార్యాచరణ సిద్ధమౌతోందనీ, ‘తెరాసకు ధీటు’గా పార్టీని తయారు చేస్తామనే కొత్త ఉత్సాహాన్ని వారు ప్రదర్శిస్తున్నారు.
అయితే, ఇప్పుడీ ప్రహసనం ఎలా ఉందంటే.. చేతులు కాలిపోయిన తరువాత ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ఉంది. తెరాసకు ధీటుగా తెలుగుదేశం ఎదిగే పరిస్థితి వాస్తవంలో ఉందా చెప్పండీ..? పార్టీని బలోపేతం చేసేస్తాం, అదిచేస్తాం ఇది చేస్తాం అని ఇప్పుడు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? వచ్చే ఎన్నికల్లో తెరాస, టీడీపీలు కలిసి పనిచేసేందుకు నేపథ్యం సిద్ధమైపోయింది. అయినా కూడా ‘తెరాసకు ధీటు’గా అనేమాట ఇంకా ఎందుకు చెప్పడం..? తెరాసతో కలిసి తాము ఎన్నికలకు వెళ్తామని తెలంగాణ టీడీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీని తమలో కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలనేది కేసీఆర్ లక్ష్యం. సో.. ఈ పరిస్థితుల్లో టీడీపీకి సొంతంగా ఏదో బలం పుంజుకుంటుందీ, నిర్ణయాత్మక శక్తిగా మారిపోతుందనే విశ్వాసం కేడర్ కి కూడా పోయింది. వాస్తవాలు ఇలా ఉంటే… రేవంత్ రెడ్డి వెళ్లిపోవడమే తమకు లభించిన అవకాశం అన్నట్టుగా సీనియర్లు సంతృప్తిపడిపోవడం, ఇన్నాళ్లూ ఏం చేశారో తెలీదుగానీ ఇప్పుడు కొత్తగా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తామని మాట్లాడుతూ ఉండటం… ఇదంతా హాస్యాస్పదంగానే ఉంది!