ఫిరాయింపులే ఒక జాడ్యం అనుకుంటే.. దాన్లో మరో అడుగు ముందుకేసి మంత్రి పదవులు కూడా కట్టబెట్టేసింది తెలుగుదేశం సర్కారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించలేదు. వారిని ఉప ఎన్నికలకు పంపలేదు. అయినాసరే, ఇటీవలి విస్తరణలో జంప్ జిలానీలకూ అవకాశం ఇచ్చారు. ఈ జంప్ జిలానీలపై చర్యలు ఎందుకు ఉండటం లేదనేది అందరికీ తెలిసిన రహస్యమే. అయితే, జంప్ జిలానీలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేర్చుకున్నంత ఈజీగా.. పార్టీలోని ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులూ కలుపుకునే పరిస్థితి టీడీపీలో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చిన వెంటనే ఎంత లొల్లి జరిగిందో అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుంటున్నవారిలో తీవ్ర అసంతృప్తి రగిలింది. కొంతమంది రాజీనామాల వరకూ వెళ్లారు. ఏదైతేనేం, తాత్కాలికంగా ఈ సమస్యను మీడియా కంటపడకుండా చేసుకున్నారు!
కానీ, ఈ అసంతృప్తుల సెగలు ఇంకా ఆరలేదని మాత్రం అర్థమౌతోంది. ఓ జంప్ జిలానీ మంత్రికి ఎదురైన అనునభవమే ఇందుకు సాక్ష్యం. విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైకాపా నుంచి వచ్చి చేరాక.. రాజుగారు మంత్రి అయ్యారు! స్థానికంగా ఆయన కేడర్ సంబరాలు చేసుకుంది. కానీ, జిల్లాలో టీడీపీ నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జెడ్పీ సమావేశానికి ఆయన వస్తున్నట్టు ముందుగానే చెప్పారట. ఆయన ఎలాగూ మంత్రి కాబట్టి.. జిల్లాలోని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి నేతలు వస్తారని అనుకుంటారు. కానీ, వారంతా మూకుమ్మడిగా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో చేరిన నాయకుడికి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టడంపై నిరసనగానే వీళ్లంతా గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు, మాజీ మంత్రి మృణాళిని కూడా సమావేశానికి రాలేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు. దీంతో దిక్కేతోచని పరిస్థితి ఎదురైంది బొబ్బిలి రాజుకి! అయితే, జెడ్పీ సమావేశంలో పాల్గొనే ముందే.. జెడ్.జి.టి.సి. సభ్యులతో మంత్రి మాట్లాడరనీ, సమావేశంలో ఎలాంటి నిరసనలకూ ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. వాళ్లనైతేనే బాగానే ఒప్పించగలిగారు.. కానీ, ఇతర టీడీపీ నేతలతో బొబ్బిలి రాజు చర్చించలేకపోయారన్నమాట.
జిల్లా నేతలంతా మూకుమ్మడిగా ఇలా నిరసన వ్యక్తం చేయడాన్ని చంద్రబాబు ఎలా చూస్తారో..? క్రమశిక్షణ చర్యల గురించి ఆలోచిస్తారా..? లేదంటే, ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు ఇవ్వడమే ఇలాంటి పరిస్థితులకు మూలం అనే కారణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారా..? ఏదేమైనా, ఫిరాయింపు నేతల్ని చంద్రబాబు ఈజీగా ఓన్ చేసుకోగలరేమో.. కానీ, పార్టీ కేడరు మాత్రం కాదనేది వాస్తవం.