చంద్రబాబు 24 బై సెవెన్ వర్క్ చేస్తూ ఉంటాడని టిడిపి నేతలు చెప్తూ ఉంటారు. రోజుకు ముఫ్ఫై గంటలపైగానే పనిచేస్తుంటాడని ఆ మధ్య ఓ టిడిపి సీనియర్ నేత ఆవేశంలో చెప్పేశాడు. ఇక నారావారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పేదేముంది. వీటన్నింటికీ తోడుగా చంద్రబాబు కూడా తన కష్టం గురించి తానే డప్పేసుకుంటూ ఉంటాడు. అలాంటి బిజీగా ఉండే చంద్రబాబుకూడా సినిమాలు బాగానే చూసేలా ఉన్నాడు. బావమరిది బాలయ్యబాబు సినిమాలను చూడడం…ఆ సినిమాలు అద్భుతం అని చెప్పడంలాంటివి ఒకటి రెండు సార్లు చేశాడు చంద్రబాబు. ఇక బాలయ్యబాబు సినిమాలతో పాటు ఇప్పుడు కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా బాగానే చూస్తున్నట్టున్నాడు. ఎంతైనా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సపోర్ట్ చేసినవాడు కదా. పవన్ సినిమాలను చూడడంతో పాటు అందులో ఉన్న సీన్స్‌ని కూడా కాపీ కొట్టేస్తున్నాడు చంద్రబాబు. గబ్బర్‌సింగ్ సినిమా చూసి ఉంటే…ఆ సినిమాలో ఉన్న ఒక సీన్ మీకు తప్పకుండా గుర్తుండే ఉంటుంది. గబ్బర్‌సింగ్ సినిమాలో అజయ్ క్యారెక్టర్ని చితక్కొట్టేస్తాడు గబ్బర్‌సింగ్(పవన్ కళ్యాణ్). ఆ వెంటనే తనకు న్యాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లోనే పంచాయితీ పెడతాడు అజయ్. అప్పుడు పెద్ద ఆఫీసర్…కామెడీ ఆఫీసర్ అయిన జయప్రకాష్ రెడ్డి అజయ్-గబ్బర్‌సింగ్ సమస్యను పరిష్కరించే పెద్దగా వస్తాడు. అజయ్‌కి గబ్బర్‌సింగ్ సారీ చెప్పాలని చెప్పి తీర్పు చెప్పి వెళ్ళిపోతాడు. గబ్బర్‌సింగ్ సారీ చెప్తాడు. ఆ తర్వాత కూడా అజయ్ చేసే పని గబ్బర్‌సింగ్‌కి నచ్చదు. ఆ వెంటనే మరోసారి సారి చెప్తాడు గబ్బర్‌సింగ్. ఒకసారి చెప్పావుగా…మళ్ళీ ఎందుకు చెప్తున్నావ్ అని అడుగుతాడు అజయ్. ‘మళ్ళీ కొట్టడానికిరా…’ అని చెప్పిన గబ్బర్‌సింగ్…..ఓవైపు సారీ…సారీ…అని వాడికి చెప్తూ….ఇరగకొట్టేస్తాడు.
ఇప్పుడు చంద్రబాబు చేసిన పంచాయితీ కూడా ఇలానే ఉంది. అత్యున్నత స్థాయి అధికారులో పనిలో జోక్యం చేసుకున్నారు. వాళ్ళకు ఉన్న సొంత ట్రావెల్స్ బిజినెస్‌లకు అనుకూలంగా పనిచేయడం లేదని, వాళ్ళు చెప్పినట్టు వినడంలేదని చెప్పి ఆ అధికారులను బండబూతులు తిట్టారు. కొట్టేవరకూ వెళ్ళారు. ప్రభుత్వాధికారుల విషయంలో ఏమేమి చేయకూడదో అవన్నీ చేసేశారు. ఆ అధికారుల అదృష్టం కొద్దీ…చంద్రబాబు భజన మీడియానే కాకుండా, కాస్త తప్పులను ఎత్తి చూపే మీడియా కూడా ఉంది కాబట్టి ఆ ఇష్యూ కాస్తా కెమేరాల్లో రికార్డ్ అయింది. రాజ్యాంగంపైన ఎన్నో ఎన్నో గొప్ప ప్రమాణాలు చేసిన టిడిపి ప్రజాప్రతినిధులు చేసిన నీచమైన, దుర్మార్గమైన, చట్టవ్యతిరేకమైన పని ప్రజలకు తెలిసిపోయింది. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఇమేజ్‌కి భంగం వాటిల్లే పరిస్థితులు ఎదురైనప్పుడు దిద్దుబాటు చర్యలు ఎలా చేపట్టాలో చంద్రబాబుకి…ఆయన భజన మీడియాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ‘ఏరా…రేయ్..పాతేస్తా నా కొ…’ అని నిండు అసెంబ్లీలో టిడిపి నేత మాట్లాడగానే వైసిపి సభ్యులు చేసిన తప్పులతో అసెంబ్లీ ఫుటేజ్ ఎవ్వరూ లీక్ చేయకుండానే లీక్ అయిపోతుంది. ఇక భూమానాగిరెడ్డి విషయంలో కూడా ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇప్పుడు కూడా సేం టు సేం. అధికారుల విషయంలో ప్రజాప్రతినిధులమన్న విషయంతో పాటు….మనుషులం అన్న విషయం కూడా మర్చిపోయి ఇష్టారీతిన ప్రవర్తించిన టిడిపి నాయకులు చంద్రబాబును కలిశారు. ఆ నాయకులపైన చంద్రబాబు అంతెత్తున ఎగిరాడు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. శిక్షించాడు అని చెప్పి బాబు భజనమీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన నిందులైన ఇద్దరు టిడిపి నేతలూ….మేం తప్పు చేశామని చంద్రబాబు చెప్పాడు. ఆ అధికారులకు సారీ చెప్పమన్నాడు. అందుకే సారీ చెప్పాం… అని చెప్పారు. అంతటితో ఇష్యూ క్లోజ్ అని చెప్పి చెప్పేశారు. పెన్ డౌన్ చేస్తామని చెప్పి అధికారులు బెదిరించడంతోనే టిడిపి నేతలు దిగొచ్చారని అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్‌తో ప్రపంచంలోనే గొప్ప పరిపాలకుడిని అని డప్పేసుకునే చంద్రబాబు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి? అధికారులను తిట్టొచ్చు, కొట్టొచ్చు. ఆ తర్వాత ఓ సారీ చెప్పేస్తే ఆల్ హ్యాపీస్ అంతేనా? ఈ ఫెసిలిటీ కేవలం ప్రజాప్రతినిధులకు….అది కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకేనా? టిడిపి నాయకులకేనా….లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంటుందా? ప్రభుత్వంపైన కోపం వచ్చినప్పుడల్లా అధికారులను నిర్బంధిస్తూ ఉంటారు రైతులు. అలాంటి సందర్భాల్లో రైతులపైన పోలీసులు బనాయించే కేసులు మామూలుగా ఉండవు. మరి కడుపు నిండి గర్వంతో వీగుతున్న నాయకులకు ఉన్న మినహాయింపులు….కడుపుకాలి స్పందిస్తున్న రైతులకు మాత్రం ఎందుకు ఉండవు. అప్పుడు మాత్రం పోలీసులు, చట్టంలాంటి ప్రస్తావన ఎందుకు? తిట్టుకోండి, కొట్టుకోండి….సారీ చెప్పేసుకోండి అని చెప్పి చంద్రన్న చట్టం అని చెప్పి ఓ కొత్త చట్టం పాస్ చెయ్యొచ్చుగా. అయినా ది గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌ని అని చెప్పుకుంటూ ఓ కమెడియన్ కాన్సెప్ట్‌ని కాపీ కొట్టడం ఏంటో కామెడీగా…?