తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పొగిడే కొద్దీ పొగుడుతున్నారు. ఆయన చెప్పింది కరెక్టేనంటున్నారు. కేటీఆర్ ఏపీలో పరిస్థితులపై వ్యాఖ్యానించి నాలుగు రోజులు అయిపోయింది. అదే రోజు అర్థరాత్రి.. అన్యాపదేశంగా అన్నానని కూడా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీడీపీ నేతలు అసలు తీసుకోవడం లేదు. అదే పనిగా కేటీఆర్‌ను పొగడటం ప్రారంభించారు. ఆయన చెప్పింది కరెక్టేనంటున్నారు. కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేసిన రోజున ప్రారంభించిన ఈ మాటలు ఇంకా కొనసాగిస్తున్నారు.
సోమవారం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేతలు కూడా కేటీఆర్ కరెక్టే చెప్పాడని అంటున్నారు. కర్నూలు పర్యటనకు వెళ్లిన లోకేష్ కూడా అదే చెప్పారు. ఎందుకు ఇలా కేటీఆర్ మాటలను మరీ ఎక్కువగా టీడీపీ నేతలు వాడేసుకుంటున్నారో…టీడీపీ క్యాడర్‌కూ అర్థం కావడం లేదు. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో కేటీఆర్‌కే తెలుసు. కానీ టీడీపీ నేతలు మాత్రం కేటీార్ చెప్పింది కరెక్టే.. కరెక్టే అని వాదిస్తున్నారు.
జగన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో రేపు కేటీఆర్… టీడీపీపై విమర్శలు చేసి.. ఏపీ మెరుగ్గా అభివృద్ధి చెందిందని ప్రకటన చేస్తే అప్పుడు టీడీపీ నేతలు కరెక్టే అంటారా అన్న డౌట్ వస్తోంది. ఇదంతా ఓ ట్రాప్ లాంటిదని దిగువస్థాయి టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే…ఇదంతా టీడీపీ అగ్రనాయకత్వానికి తెలియనిదే కాదని..ఉద్దేశ పూర్వకంగానే కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు చేయిస్తున్నారని… దీని వెనుక బయటక తెలియని రాజకీయం ఉందని కొంత మంది భావిస్తున్నారు.
వైసీపీ నేతల్లోనూ ఇదే డౌట్ కనిపిస్తోంది. కేటీఆర్ అలా ఎందుకన్నారో సజ్జలకు కూడా అర్థం కాలేదు. అలాగని ఆయనను నేరుగా ఏమీ అనలేకపోతున్నారు. ఆ వ్యాఖ్యలను వాడుకుంటున్న టీడీపీ నేతలపై మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.