సినీ పరిశ్రమలో వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడటం ఈరోజుల్లో చాలా సాధారణమైన విషయమే కానీ తెదేపా, వైకాపా నేతలు సినిమాల గురించి వాదోపవాదాలు చేసుకోవడం ప్రజలకి చాలా వినోదం కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తాను సినిమాలో హీరోవంటివాడినని, చంద్రబాబు విలన్ అని, మొదట్లో విలన్ పెట్రేగిపోయినా సినిమా పూర్తయ్యేసరికి హీరో చేతిలో చావుదెబ్బలు తిని జైలుకి వెళ్ళక తప్పదని చెప్పడంతో ఈ సినిమా గోల మొదలైంది.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రం అనాధ అయిపోయిందని, దానికి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్ధించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రస్తుతం తెదేపా పంచన చేరారు కనుక వేరేలాగ మాట్లాడుతున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటున్న జగన్మోహన్ రెడ్డే రాష్ట్రం పాలిట విలన్ గా మారారని, మిగిలిన 36 (నెలలు) రీళ్ళు పూర్తయితే చంద్రబాబు నాయుడే మళ్ళీ హీరోగా నిలువబోతున్నారని, విలన్ జగన్ కి ఆయన చేతిలో పరాభవం తప్పదని అన్నారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా సినీ పరిబాషలోనే జవాబిస్తూ, “మొదటి 14 రీల్స్ పూర్తి కాకుండానే విలన్ (జగన్) జైలుకి వెళ్ళారని, ఇంటర్వెల్ తరువాత సినిమాని రక్తి కట్టించేందుకే కాంగ్రెస్ అధిష్టానం విలన్ని జైలు నుంచి విడిపించి బయటకి తీసుకు వచ్చిందని అన్నారు. 14వ రీలు పూర్తయ్యేసరికి మళ్ళీ విలన్ చంచల్ గూడా జైలుకి తిరిగి వెళ్ళడం కాహ్యం అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి దేశంలో అత్యుత్తమ విలన్ అని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. ఎంతవారినైనా చులకనగా మాట్లాడటం, అభివృద్ధి పనులకి అడ్డుపడుతుండటం ఈ విలన్ ముఖ్య లక్షణాలని అన్నారు. ఈ విలన్ కి అసలు సభ్యత, సంస్కారం లేవని అన్నారు.
హీరో వంటి చంద్రబాబు నాయుడుని దేశంలో అందరూ మెచ్చుకొంటుంటే, విలన్ జగన్ కి మాత్రం ఆయనలో ఎప్పుడూ తప్పులే కనిపిస్తుంటాయని అన్నారు.
సినిమాలో కూడా హీరో, విలన్ ఇద్దరూ తామే చాలా బలవంతులమని, తెలివైనవాళ్ళమని అన్నట్లు వ్యవహరిస్తూ సినిమాని రక్తి కట్టిస్తుంటారు. కానీ వాళ్ళిద్దరూ రచయిత వ్రాసిన కధ ప్రకారం, దర్శకుడు చెప్పినట్లుగానే నటిస్తుంటారు తప్ప వాళ్ళు నిజమైన హీరోలు కాదు విలన్లు కాదు. దర్శకుడు ఏ పాత్రకి ఎవరు సరిపోతారో నిర్ణయిస్తే వాటిని వారు పోషిస్తారు అంతే. ఒకసారి సినిమా మొదలైన తరువాత అదొక ప్రవాహంలా సాగిపోతుంది. రాజకీయాలు కూడా అంతే.
సినిమాల ఆయుషు 14రీళ్ళు అయితే అధికారం ఆయుష్షు 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో ఎవరు హీరో పాత్ర పోషించాలి.. ఎవరు విలన్ పాత్ర పోషించాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చేయడం లేదని ప్రజలు భావిస్తే ఆ పాత్రలకి వేరే వాళ్ళని ఎన్నుకొంటారు. ఈ విషయం మన రాజకీయ నాయకులకి చాలా బాగా తెలిసి ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నవాళ్ళు తమ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి తెలుగు సినిమా హీరోలలాగా ఎప్పటికీ తామే హీరోలుగా ఉండిపోతామని భ్రమ పడుతుంటారు. మన తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి వాటిని రక్తి కట్టించిన మోహన్ బాబు, శ్రీహరి వంటివాళ్ళు ఆ తరువాత కాలంలో ‘మంచి హీరోలు’ గా మారిపోయినట్లే, జగన్మోహన్ రెడ్డి కూడా హీరోగా మారిపోయి చంద్రబాబుపై పగ తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ ఆ ప్రయత్నంలో మరీ అతిగా విలన్ లాగ నటించేస్తున్నారు. ఆయన చంద్రబాబుని “అవినీతిపరుడు..చెప్పులతో కొట్టాలి…చీపుర్లతో తరిమి కొట్టాలి.. జైలుకి వెళతాడు..”అంటూ ‘దర్శకులు’ చెప్పని అనవసరమైన డైలాగులు పదేపదే పలుకుతుంటే, “జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నాడు..అతనే అసలైన విలన్..చివర్లో అతనే జైలుకి వెళ్ళాక తప్పదు,” అని తెదేపా నేతలు చెపుతున్నారు.
వారికి ఆ పాత్రలు ఇచ్చిన ప్రజలు వారి ప్రదర్శనని చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నారు. 2019ఎన్నికలలో ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో వాళ్ళే నిర్ణయిస్తారు. అంతవరకు హీరో, విలన్ ఇద్దరూ కూడా తామే అసలైన హీరోలమని భావిస్తూ నిరభ్యంతరంగా కాలక్షేపం చేసుకోవచ్చు.